న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బ్రిటన్ సహా పలు దేశాలు ఇండియన్లపై ఆంక్షలను సడలించాయి. కరోనాను నియంత్రించడానికి గతేడాది మార్చి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను భారత్ సస్పెండ్ చేసింది. అయితే, 28 దేశాలతో కుదిరిన ఒప్పందాల మేరకు ఆయా దేశాల పౌరులతోపాటు భారతీయులను సొంత దేశానికి తరలించేందుకు గతేడాది జూన్ నుంచి ప్రత్యేక సర్వీసులు నడుస్తున్నాయి.
భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలను ఈ నెల 17న అమెరికా సడలించింది. లెవెల్ 2 స్థాయికి తగ్గించింది. భారత్‌కు వెళ్లడానికి అమెరికన్లను ప్రోత్సహించినా వారు తమ భద్రత గురించి ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. కొన్ని వర్గాల వారు మినహా భారతీయుల రాకపై నిషేధం విధించింది.
భారత్ నుంచి వచ్చే ప్రయాణికులు విమానం ఎక్కడానికి ఆరు గంటల ముందు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం ఆదేశించింది.
భారత్ నుంచి ప్రయాణికుల రాకను అనుమతించిన బ్రిటన్ షరతులు విధించింది. బయలు దేరడానికి మూడు రోజుల ముందు, రెండు రోజుల, ఒక రోజు ముందు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ నివేదికలు సమర్పించాలి. బ్రిటన్‌కు చేరుకున్న రోజు లేదా తర్వాత రోజు, మూడో రోజు లేదా ఎనిమిదో రోజు ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లు చేయించుకోవాలి. ఈ నెల 8న భారత్ ప్రయాణికులపై విధించిన రెడ్ లిస్ట్‌ను ఎత్తేసింది. భారత్ నుంచి వచ్చే బ్రిటిష్ జాతీయులకు క్వారంటైన్ నిబంధనను సడలించింది. కానీ బ్రిటన్‌లో దిగగానే ఆర్టీపీసీఆర్ టెస్ట్ తప్పనిసరి చేసింది.
కరోనా కేసులు తగ్గుతున్నా, భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై పలు ఈయూ సభ్య దేశాలు నిషేధం కొనసాగిస్తున్నాయి. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధించిన చెక్ రిపబ్లిక్.. చెక్ జాతీయులను మాత్రమే అనుమతిస్తున్నది. ఆస్ట్రియా, ఈస్టోనియా, ఐస్లాండ్ ఇప్పటికీ భారత్‌ను రెడ్లిస్ట్లోనే ఉంచాయి. తమ దేశాలకు వచ్చిన వారు తప్పనిసరిగా 10 రోజుల స్వీయ నిర్బంధం, డబుల్ టెస్టింగ్‌ను తప్పనిసరి చేసింది. భారత్‌ను డిజిగ్నేటెడ్ జాబితాలో చేర్చిన ఐర్లాండ్.. ఇండియన్లు తప్పనిసరిగా ప్రీ ట్రావెల్ ఆర్టీపీసీఆర్ లేదా యాంటి జెన్ టెస్ట్ చేయించుకోవాలి. 14 రోజులు క్వారంటైన్ కావాలి.
డెల్లా వేరియంట్ వైరస్లు విశ్వరూపం దాల్చిన నేపథ్యంలో భారత్‌ను రిస్క్ క్యాటగిరీలో చేర్చింది హాంకాంగ్. భారత్ నుంచి బయలు దేరడానికి 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ టెస్ట్ నివేదిక సమర్పించాలి. 21 రోజులు తప్పనిసరి క్వారంటైన్ కావాలి.
కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నవారు, ఒకసారి వైరస్ సోకి తర్వాత నెగెటివ్ అని తేలిన వారు జర్మనీకి వెళ్లడానికి అర్హులు. భారత్, ఈజిప్టు తదితర దేశాలతో వాణిజ్య విమాన సర్వీసులు నడుపుతున్నది. మంత్రివర్గ కమిటీ సిఫారసుల మేరకు కోవిడ్ నిబంధనలను పాటించాలని కోరుతున్నది. బంగ్లాదేశ్, పాకిస్థాన్, నేపాల్ దేశాలతో కువైట్ ఎయిర్‌లైన్స్ సర్వీసులను పునరుద్ధించింది.