హైదరాబాద్, డిసెంబర్ 20: ట్రాన్జాక్షన్ అనలిస్ట్స్ (టీఏ) ప్రైవేట్ లిమిటెడ్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పేమెంట్ అగ్రిగేటర్ (పీఏ) లైసెన్స్ మంజూరు చేసింది. 2014లోనే ఈ సంస్థకు ప్రీపెయిడ్ పేమెంట్ ఆపరేషన్స్ లైసెన్సును ఆర్బీఐ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ కోసం సూత్రప్రాయ ఆమోదాన్ని ఆర్బీఐ తెలిపింది. ఈ మేరకు మంగళవారం టీఏ ప్రకటించింది. కాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక డిజిటల్ వ్యాలెట్.. టీ వ్యాలెట్‌ను టీఏనే నిర్వహిస్తున్న సంగతి విదితమే. ‘ఆర్బీఐ నుంచి పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ కోసం సూత్రప్రాయ ఆమోదాన్ని అందుకోవడం ఆనందంగా ఉన్నది. ఇక డిజిటల్ ఫైనాన్షియల్స్‌లో మా సేవలను మరింత విస్తరిస్తాం.
పట్టణాలు, గ్రామాలతోపాటు మారుమూల ప్రాంతాలకూ సేవలను అందుబాటులోకి తెస్తాం’ అని టీఏ వ్యవస్థాపక ఎండీ, సీఈవో శ్రీనివాస కాటూరి అన్నారు. 2011లో టీఏను కాటూరి స్థాపించారు. 2014లో పీపీఐ వ్యాపారాన్ని మొదలు పెట్టారు. ఇదిలావుంటే ఇప్పటికే ఆర్బీఐ నుంచి పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్సులను అందుకున్న సంస్థల్లో పైన్ ల్యాబ్స్, పేయూ, రేజర్ పే, క్యాష్‌ఫ్రీ, సీసీఅవెన్యూ, బిల్‌డెస్క్ మొదలైనవి ఉన్నాయి. పేమెంట్ అగ్రిగేటర్ అనేది ఓ థర్డ్-పార్టీ. వినియోగదారులతో వ్యాపారుల ఆన్లైన్ లావాదేవీలను మేనేజింగ్, ప్రాసెసింగ్ చేస్తుంది. వినియోగదారులు చేసే రకరకాల చెల్లింపులను వ్యాపారులు అంగీకరించేలా పేమెంట్ అగ్రిగేటర్ దోహదం చేస్తుంది.