ముంబై, అక్టోబర్ 15: ‘క్రికెట్లో వికెట్కీపర్లు, ఫుట్బాల్లో గోల్కీపర్లు ఎలాగో సెంట్రల్ బ్యాంకులూ అంతే. వారు సాధించే విజయాలను ఎవరూ గుర్తించరు. కానీ వైఫల్యాలను మాత్రం ఎత్తిచూపుతారంతా’ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్లలో ఒకరైన స్వామినాథన్ జే ఒకింత నిరాశతో వ్యాఖ్యానించారు. ‘సెంట్రల్ బ్యాంకింగ్ ఎట్ క్రాస్ రోడ్స్’ అంశంపై జరిగిన ఆర్బీఐ@90 ఉన్నతస్థాయి సదస్సులో స్వామినాథన్ మాట్లాడారు.
గడిచిన కొన్నేండ్లలో బ్యాంకింగ్ రంగంలో, దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతిలో సెంట్రల్ బ్యాంకుల పాత్ర ఎంతో పెరిగిందన్నారు. నియంత్రణ, పర్యవేక్షణ, ద్రవ్యవిధానాలతో ఆర్థిక వ్యవస్థను సెంట్రల్ బ్యాంకులే సుస్థిరం చేస్తున్నాయని చెప్పారు. ఆర్థిక రంగమే దేశానికి వెన్నెముకని, అలాంటి కీలక రంగాన్ని రకరకాల సాధనాలతో వివిధ ముప్పుల నుంచి రక్షించేది సెంట్రల్ బ్యాంకులేనని పేర్కొన్నారు. అయినప్పటికీ ఎంత శ్రమించినా సంక్షోభం సమయాల్లో ఏం చేస్తున్నారన్న ప్రశ్నలే ఎదురవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ద్రవ్యోల్బణం 4.5 శాతంగానే..
ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 4.5 శాతంగానే నమోదు కావచ్చని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లలో ఒకరైన మైఖేల్ దేబబ్రత పాత్ర ఆశాభావం కనబర్చారు. వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి కట్టడి చేయాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి 2 శాతం తక్కువ, ఎక్కువలుండవచ్చన్న మినహాయింపులూ ఉన్నాయి. ఈ క్రమంలో గడిచిన 3 నెలలుగా ద్రవ్యోల్బణం రేటు 6 శాతం దిగువనే ఉన్నదని పాత్ర ఈ సదస్సు సందర్భంగా గుర్తుచేశారు. ఈ నేపథ్యంలోనే మొత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం సగటు 4.5 శాతంగా ఉండొచ్చన్న అంచనాను వెలిబుచ్చారు. కాగా, సెప్టెంబర్లో 9 నెలల గరిష్ఠాన్ని తాకుతూ 5.5 శాతంగా నమోదైన సంగతి విదితమే. కూరగాయల ధరలు పెరగడంతో ఆహార ద్రవ్యోల్బణం 9.2 శాతానికి ఎగిసింది.