Tractor Sales | జీఎస్టీ తగ్గింపు, పండుగ సీజన్ నేపథ్యంలో పెరిగిన డిమాండ్‌తో సెప్టెంబర్ ట్రాక్టర్ల అమ్మకాలు రికార్డులను సృష్టించారు. ట్రాక్టర్, మెకనైజేషన్ అసోసియేషన్ (TMA) డేటా ప్రకారం.. సెప్టెంబర్‌లో దేశీయ మార్కెట్లో 1.46లక్షల కంటే ఎక్కువ ట్రాక్టర్లు అమ్ముడయ్యాయి. గతంలో అత్యధిక సంఖ్య అక్టోబర్ 2024లో 1,44,675 ట్రాక్టర్లు అమ్ముడయ్యాయి. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ రేట్లను తగ్గించింది. తాజాగా ట్రాక్టర్లపై జీఎస్టీని 12 శాతం నుంచి కేవలం 5శాతానికి తగ్గించారు. 1,800 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం కలిగిన రోడ్ ట్రాక్టర్లపై పన్నును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య మొత్తం 7.61 లక్షల ట్రాక్టర్లు అమ్ముడయ్యాయి. ఇది గత సంవత్సరం ఇదే కాలం కంటే 20 శాతం ఎక్కువ. దీపావళి సీజన్లో డిమాండ్ మరింత పెరుగుతుందని, వార్షిక అమ్మకాలు మొదటిసారిగా 10 లక్షల యూనిట్లను దాటవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ సంవత్సరం రుతుపవనాలు సాధారణం కంటే మెరుగ్గా ఉన్నాయి.
సెప్టెంబర్ మధ్యకాలం వరకు మొత్తం వర్షపాతం దీర్ఘకాలిక సగటులో 108 శాతం, ఇది పంట ఉత్పత్తిని పెంచుతోంది. భారత్‌లో అతిపెద్ద ట్రాక్టర్ తయారీదారు మహీంద్రా అండ్ మహీంద్రా (MM), సెప్టెంబర్‌లో డీలర్‌షిప్‌లకు సరఫరాలను 50 శాతం పెంచింది. ఎంఅండ్ఎం వ్యవసాయ పరికరాల వ్యాపార అధ్యక్షుడు విజయ్ నక్రా మాట్లాడుతూ.. జీఎస్టీ రేటు తగ్గింపు నవరాత్రి తొమ్మిది రోజుల్లో అమ్మకాల్లో గణనీయమైన పెరుగుదలకు దారి తీసింది. ఎస్కార్ట్స్ కుబోటా అమ్మకాలు సెప్టెంబర్‌లో 49 శాతం పెరిగి 17,800 యూనిట్లకు చేరుకున్నాయి. ఇది కంపెనీ చరిత్రలో అత్యుత్తమ నెలగా నిలిచింది. సోనాలికా ట్రాక్టర్స్ దాదాపు 27,800 ట్రాక్టర్లను విక్రయించింది. గత సంవత్సరం కంటే దాని అమ్మకాల సంఖ్యను రెట్టింపు చేసింది. ఐసీఆర్ఏ నివేదిక ప్రకారం.. ట్రాక్టర్లపై జీఎస్టీని 5శాతానికి తగ్గించడం వల్ల డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా పండుగ సీజన్లో అదనంగా వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చే కొత్త టెర్మ్వీ (TREM V) ఉద్గార ప్రమాణాలకు ముందే పరిశ్రమ ముందస్తు కొనుగోళ్లు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నది.