న్యూఢిల్లీ, మే 15: ఎగుమతులు నీరసించాయి. గత కొన్ని నెలలుగా రెండంకెల వృద్ధిని నమోదు చేసుకున్న ఎగుమతులు గత నెలలో సింగిల్ డిజిట్‌కు పరిమితమయ్యాయి. ఏప్రిల్ నెలలో దేశీయ ఎగుమతులు ఒక్క శాతం వృద్ధితో 34.99 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇదే నెలలో భారత్ 54.09 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నది. దీంతో వాణిజ్యలోటు(దిగుమతులు, ఎగుమతుల మధ్య వ్యత్యాసం) నాలుగు నెలల గరిష్ఠ స్థాయిని తాకి 19.1 బిలియన్ డాలర్లుగా నమోదైంది. డిసెంబర్ 2023లో నమోదైన 19.8 బిలియన్ డాలర్ల తర్వాత ఇదే గరిష్ఠ స్థాయి కావడం విశేషం. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఏప్రిల్ 2023లో వాణిజ్యలోటు 14.44 బిలియన్ డాలర్లుగా ఉన్నది. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఎలక్ట్రానిక్స్, కెమికల్స్, పెట్రోలియం ఉత్పత్తులు, ఔషధాలకు డిమాండ్ ఉండటం వల్లనే ఎగుమతుల్లో ఈ మాత్రమైన వృద్ధిని సాధించాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
పసిడి దిగుమతుల జోరు తగ్గడం లేదు. ధరలు గరిష్ఠ స్థాయికి చేరుకున్నప్పటికీ భారత్‌లో అతి విలువైన లోహాల వాడకం మాత్రం తగ్గడం లేదు. ఏప్రిల్ నెలలో 3.11 బిలియన్ డాలర్ల విలువైన పసిడి దిగుమతి చేసుకున్నారు. క్రితం ఏడాది అయిన దిగుమతులతో పోలిస్తే మూడింతలు పెరిగింది. అలాగే క్రూడాయిల్ దిగుమతులు కూడా 20.22 శాతం పెరిగి 16.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి నెలలో ఆశాజనక పనితీరు కనబరిచినట్లు, ఇది భవిష్యత్తులోనూ కొనసాగే అవకాశాలున్నాయని కేంద్ర వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్తాల్ తెలిపారు. అలాగే 2023-24 ఎగుమతుల గణాంకాలను 778.21 బిలియన్ డాలర్లకు సవరించినట్లు ఆయన చెప్పారు. గత నెలలో 30 కీలక రంగాల్లో 13 విభాగాలు వృద్ధిని నమోదు చేసుకున్నాయని, వీటిలో కాఫీ, తంబాకు, ప్లాస్టిక్, హస్తకళలు ఉన్నాయన్నారు.