PNB Mobile allowance | గతంలో పుస్తకం హస్తభూషణం అన్నారు పెద్దలు.. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్ ఉండి తీరాల్సిందే. ఆ స్మార్ట్ ఫోన్ ధరలు కూడా కంపెనీని బట్టి ఉంటాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) సరికొత్త నిర్ణయం తీసుకున్నది. తమ బ్యాంకులో మేనేజ్మెంట్ స్థాయిలో పని చేస్తున్న ఎగ్జిక్యూటివ్‌లకు ఏటా రూ.2 లక్షలు కేవలం మొబైల్ ఫోన్ కొనుగోలు చేయడానికి అలవెన్స్ కేటాయిస్తున్నదీ బ్యాంక్.. సిబ్బంది సంక్షేమం కోసం నిబంధనలు సవరించారు. మేనేజింగ్ డైరెక్టర్‌తోపాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు ఈ అలవెన్స్ ఇస్తారు. గమ్మత్తేమిటంటే ఈ అలవెన్స్ కింద స్మార్ట్ ఫోన్ కొంటే జీఎస్టీ రాయితీ కూడా కల్పించారు. గత ఏప్రిల్ నుంచి సవరించిన నిబంధనలు అమల్లోకి వచ్చాయని సంబంధిత వర్గాలు చెప్పారు.
ఇప్పుడు పీఎన్బీకి ఒక సీఈవో కం మేనేజింగ్ డైరెక్టర్.. ఆయనకు సాయంగా నలుగురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పని చేస్తారు. వీరందరికీ ఏటా కొత్త మొబైల్ ఫోన్ కొనుగోలు చేయడానికి రూ.2 లక్షలు అలవెన్స్‌గా బ్యాంక్ అందించనున్నదన్న మాట. బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్లు మొబైల్ ఫోన్లు కొనడానికి రూ.50 వేలు, జనరల్ మేనేజర్లు ఒక స్మార్ట్ ఫోన్ కొనేందుకు రూ.40వేలు అలవెన్స్‌లు కేటాయించారు.
అంతేకాదు.. కార్ల వినియోగం విషయమై కూడా పీఎన్బీ మేనేజ్మెంట్ పలు మార్పులు చేసింది. చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) స్థాయి అధికారులు వాడే కార్ల ధర రూ.12 లక్షల నుంచి రూ.15.50 లక్షలకు, జనరల్ మేనేజర్ స్థాయి అధికారుల కార్ల ధర పరిమితి రూ.9 నుంచి రూ.11.50 లక్షలకు పెంచేసింది. రెండేండ్ల క్రితం ఇదే బ్యాంక్.. ఎండీ, ఇద్దరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు మూడు ఆడీ కార్లు కొనుగోలు చేసి వార్తలోకెక్కింది. మేనేజ్మెంట్కు స్మార్ట్ ఫోన్ అలవెన్స్ కేటాయింపుపై ఈ-మెయిల్ పంపినా పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్పందించలేదని సమాచారం.