Tata Motors EV Cars | ఒకవైపు భారీగా పెరిగిన పెట్రోల్.. డీజిల్ ధరలు.. మరోవైపు కర్బన ఉద్గారాల నియంత్రణ పర్యావరణ పరిరక్షణ లక్ష్యం దిశగా అడుగులు.. చౌక ధరకే విద్యుత్ వాహనాలు.. దీంతో దేశీయంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రత్యేకించి ఈవీ కార్ల పరిశ్రమ నిరంతరం పెరుగుతున్నది. ఇటీవలి కాలంలో భారత ఈవీ మార్కెట్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ తరహా మార్పులు మున్ముందు కూడా పెరుగుతాయని భావిస్తున్నారు. ఇప్పటికే భారత్ కార్ల మార్కెట్లోకి పలు సంస్థలు నూతన ఈవీ కార్లు ఆవిష్కరించాయి. వాటిల్లో టాటా మోటార్స్ ముందు వరుసలో నిలిచింది. ఇప్పటి వరకు మూడు ఈవీ కార్లు టాటా టైగోర్ ఈవీ, టాటా టియాగో ఈవీ, టాటా నెక్సాన్ ఈవీ మోడల్ కార్లను ఆవిష్కరించింది. దేశంలోనే పేరొందిన ఈ ఆటోమొబైల్ కంపెనీ.. రెండేండ్లలో మరో ఐదు విద్యుత్ కార్లను దేశీయ మార్కెట్లో ఆవిష్కరించనున్నది..
పవర్ ట్రైన్‌తో వస్తున్న టాటా పంచ్ ఈవీ (Tata Punch EV) ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ కలిగి ఉంటుంది. టాటా నెక్సాన్ ఈవీ మాక్స్ నుంచి డ్రైవ్ సెలెక్టర్ వినియోగిస్తున్నారు. 30.2 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీ వాడుతున్నట్లు సమాచారం. జిప్ట్రాన్ ఈవీ పవర్ ట్రైన్‌తో ఈ కారు నడుస్తుంది. జిప్ట్రాన్ పవర్ ట్రైన్లో లిక్విడ్ కూల్డ్ బ్యాటరీ, పర్మినెంట్ మాగ్నైట్ సింకరోనస్ మోటార్ కలిగి ఉంటుంది. 10.25-అంగుళాల టచ్ స్క్రీన్ తో వస్తున్నది. ఈ కారు మోటార్ 100 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. సింగిల్ చార్జింగ్ తో 300 కి.మీ. పైగా ప్రయాణం చేయవచ్చు. ఈ కారు ధర రూ.25 లక్షలు పలుకవచ్చు.
ఒక కారు కొనుక్కోవాలని భావించే వారికి అందుబాటులో ధరలో లభించే కారు టాటా నానో ఈవీ (Tata Nano EV). ఈ కారుతో ఎటువంటి రోడ్లపైనైనా ప్రయాణించవచ్చు. 17 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీతో వస్తుంది. ఈ కారు మోటారు 27 హెచ్‌పీ విద్యుత్, 68 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. సింగిల్ చార్జింగ్ తో 120-140 కి.మీ. దూరం ప్రయాణం చేయవచ్చు. ఫాస్ట్ చార్జర్ సాయంతో 75 నిమిషాల్లో 80 శాతం చార్జింగ్ అవుతుంది. టాటా మోటార్స్, జయేం ఆటోమోటివ్స్ సంయుక్త ఆధ్వర్యంలో టాటా నానో ఈవీ కారు మార్కెట్లోకి వస్తున్నది. టాటా నానో ఈవీ కారు ధర రూ.5-8 లక్షల మధ్య పలుక వచ్చు.
టాటా మోటార్స్ గతేడాది ఏప్రిల్ ఆరో తేదీన లైవ్ స్ట్రీమింగ్ కార్యక్రమంలో ‘న్యూ కర్వ్ ఈవీ (Tata Curvv EV)’ కారును ఆవిష్కరించింది. ఎయిర్ డైనమిక్ వీల్స్, డ్రైవర్ కంఫర్ట్ కోసం యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ ఫేస్ స్క్రీన్లు, పనోరమా రూఫ్ తదితర ఫీచర్లు ఉంటాయి. ఈ కారును వచ్చే ఏడాది మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని ధర రూ.24 లక్షలు ఉంటుందని అంచనా.
టాటా సియారా (Tata Sierra EV) ఎలక్ట్రిక్ కారు కాన్సెప్ట్ 2020 ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించారు. ఈ కారు న్యూ సిగ్మా ఆర్కిటెక్చర్ పై నిర్మిస్తారు. రెండు వేర్వేరు వర్షన్లలో టాటా సియారా ఈవీ కారు ఆవిష్కరిస్తారని భావిస్తు్న్నారు. ఫ్రంట్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ వర్షన్లు రానున్నాయి. ఈ కారు స్కోడా కుషాఖ్, హ్యుండాయ్ క్రెటా కంటే చిన్న కారు. రేర్ లగేజ్ కంపార్ట్ మెంట్, స్పేసియస్ ఇంటీరియర్, ఎలిగెంట్ షైనింగ్, పనోరమిక్ సన్ రూఫ్ వంటి ఫీచర్లు ఉంటాయి. 2024 డిసెంబర్లో ఈ కారు మార్కెట్లోకి రానున్నది. దీని ధర రూ.25 లక్షలు ఉండొచ్చు.
టాటా అవిన్యా ఈవీ (Tata Avinya EV) పూర్తిగా టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (టీపీఈఎం) నుంచి వచ్చే నెక్స్ జనరేషన్ కారు. ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ లో డిజైన్ చేస్తు్న్నారు. పూర్తిగా జెన్ 3 ఆర్కిటెక్చర్ తో తీర్చిదిద్దుతున్న ఇన్నోవేటివ్ కారు ఇది. ఈ కారు విలాసవంతంగానూ, ఇంటీరియర్‌గా స్పేసియస్‌గా ఉంటుంది. స్మార్ట్, ఇన్నోవేటివ్, సస్టయినబుల్ సిస్టమ్స్‌తో నిర్మిస్తున్నారు. ఆల్ట్రా ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్.. కేవలం 30 నిమిషాల్లో 500 కి.మీ. దూరం దూసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంటుంది. గతేడాది ఏప్రిల్ 29న ఈ కారును ఆవిష్కరించారు.