న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15 : కార్లపై రుణాలు తీసుకోవాలనుకుంటున్నవారు బ్యాంకులకు షాకిస్తున్నారు. రుణాలు మంజూరైనప్పటికీ రద్దు చేసుకుంటున్నారు. కార్లపై జీఎస్టీ తగ్గుతుండటంతో ధరలు భారీగా దిగనుండటమే కారణం. 1,200 సీసీ ఇంజిన్ కలిగిన కార్లపై జీఎస్టీని 18 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం ఈ నెల 22 నుంచి అమలులోకి రానుండటంతో అప్పటి వరకు వాహన కొనుగోలుదారులు తమ నిర్ణయాన్ని వాయిదావేస్తున్నారు.
ఆ తర్వాతనే కార్ల ధరలను తగ్గించనున్నట్లు దేశీయ, అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. దీంతో వారు ఆర్థిక ప్రయోజనాలను పొందడానికి తమ కొనుగోలు నిర్ణయాన్ని వాయిదావేస్తున్నారు. తమ కార్ల రుణాలను రద్దు చేయండని బ్యాంకులకు విజ్ఞప్తిలు వస్తున్నాయి. చిన్న కార్లతోపాటు ఎస్యూవీల ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి.
వాహన రేట్లు తగ్గిన తర్వాతనే కొనుగోళ్లు జరుపుతామని, అప్పుడే రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటామని బ్యాంకర్లకు కొనుగోలుదారులు హామీలు ఇస్తున్నారు. ఇప్పటికే పలు బ్యాంకులు వాహన, గృహ రుణాలపై ప్రాసెసింగ్ చార్జీలను ఎత్తివేశాయి కూడా.