Royal Enfield | ఫేమస్ టూ వీలర్స్ తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) కు పోటీగా కొత్త బ్రిటిష్ మోటార్ సైకిల్ కంపెనీ క్లాసిక్ లెజెండ్స్ (Classic Legends) కొత్త మోటార్ సైకిల్ తీసుకొస్తోంది. భారత్‌లో జావా (Jawa), యెజ్డీ (Yezdi) మోటారు సైకిళ్లను తయారు చేస్తున్నదీ క్లాసిక్ లెజెండ్స్. ప్రస్తుతం భారత్ మార్కెట్లో రెట్రో మోటార్ సైకిళ్లకు శరవేగంగా ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో రాయల్ ఎన్ఫీల్డ్ మోటారు సైకిళ్లకు పోటీగా 650సీసీ మోటార్ సైకిల్ తేవడానికి క్లాసిక్ లెజెండ్స్ (Classic Legends) సిద్ధమైనట్లు తెలుస్తోంది. వచ్చే ఆగస్టు 15న భారత్ మార్కెట్లో క్లాసిక్ లెజెండ్స్ కొత్త మోటార్ సైకిల్ ఆవిష్కరణకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో బీఎస్ఏ గోల్డ్‌స్టార్ పేరుతో విక్రయిస్తున్నారు.
మోడ్రన్ అవతార్‌లో గోల్డ్ స్టార్ మోటారు సైకిల్ వస్తోంది. టాప్‌పై ట్విన్ పాడ్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్, ఫ్రంట్ ఎండ్‌లో రౌండ్ హెడ్ ల్యాంప్, రౌండ్ బీఎస్ఏ లోగో కూడా ఉంటుంది. సింగిల్ పీస్ సీట్, బ్యాక్‌లో ఫెండర్ కాంబో, రెట్రో టెయిల్ లాంప్ ఉంటాయని తెలుస్తోంది.
రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ మోటారు సైకిల్ ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో వస్తుండగా, బీఎస్ఏ గోల్డ్ స్టార్ 652 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ మోటార్ కలిగి ఉంటుంది. గ్లోబల్ మార్కెట్లలో అందుబాటులో ఉన్న బీఎస్ఏ గోల్డ్ స్టార్ మోటారు బైక్ ఇంజిన్ గరిష్టంగా 45 బీహెచ్పీ విద్యుత్, 55 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. ఇండియన్ వర్షన్ మోటారు సైకిల్ ఇంజిన్ కెపాసిటీలో మార్పులు ఉండవచ్చునని భావిస్తున్నారు.
భారత్ మార్కెట్లో రెట్రో లుక్ మోటారు సైకిళ్లకు రోజురోజుకు ఆదరణ పెరుగుతున్నది. ఇప్పటికైతే ఈ సెగ్మెంట్లో హవా కొనసాగిస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ కు పోటీగా ఇతర ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలు జత కట్టాయి. ట్రయంఫ్ భాగస్వామ్యంతో బజాజ్ ఆటో, హార్లే డేవిడ్సన్ భాగస్వామ్యంతో హీరో మోటో కార్ప్ కొత్త మోటారు సైకిళ్లను మార్కెట్లోకి తెస్తున్నాయి.