న్యూఢిల్లీ, అక్టోబర్ 14: దీపావళి పండుగ సందర్భంగా ఈసారి మార్కెట్లో భారీ ఎత్తున అమ్మకాలు జరగవచ్చని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలోనే రూ.2.5 లక్షల కోట్ల విలువైన వస్తూత్పత్తుల షాపింగ్, ప్రయాణాలు-సేవల వినియోగం ఉండొచ్చని అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) అంటున్నది. ఆటోమొబైల్స్, రియల్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసీజీ, జ్యుయెల్లరీ, దుస్తులు, గిఫ్ట్ ఆర్టికల్స్ ఇలా మెజారిటీ రంగాల్లో సేల్స్ ఆశాజనకంగా ఉన్నాయని, పండుగ సమీపిస్తున్నకొద్దీ విక్రయాలు మరింత పెరుగుతాయన్న విశ్వాసాన్ని సీఏఐటీ వ్యక్తం చేసింది. ఇప్పటికే వాహన అమ్మకాల్లో పెరుగుదల కనిపిస్తుండగా.. ద్విచక్ర, త్రిచక్ర, వాణిజ్య వాహనాలతోపాటు ప్యాసింజర్ వాహనాలు, ట్రాక్టర్ల కొనుగోళ్లు పెరిగాయని ఇటీవల విడుదలైన ఆటో ఇండస్ట్రీ గణాంకాలే చెప్తున్నాయి. నవరాత్రి అమ్మకాలు 57 శాతం ఎగిశాయని ఎఫ్ఏడీఏ తెలిపింది.
రెండేండ్ల తర్వాత..
గడిచిన రెండు సంవత్సరాలు కూడా కరోనా కారణంగా దేశవ్యాప్తంగా మార్కెట్ స్తంభించిపోయింది. దీంతో పండుగల సీజన్ వ్యాపారులకు ఎంతమాత్రం కలిసిరాలేదు. అయితే ఈసారి పరిస్థితులు చాలావరకు చక్కబడ్డాయి. ముఖ్యంగా కరోనా కేసులు బాగా తగ్గడంతో ఎటువంటి ఆంక్షలు లేవని, ఇది షాపింగ్‌కు వినియోగదారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపగలవని వ్యాపారులు అంటున్నారు. ఆర్థిక కార్యకలాపాలు తిరిగి పుంజుకుంటుండటంతో కొనుగోలుదారుల చేతుల్లో నగదు లభ్యత సైతం పెరిగిందని చెప్తున్నారు.