న్యూఢిల్లీ : నాస్డాక్ లిస్టెడ్ క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ వేదిక భారత్‌లో ఈ ఏడాది వేయిమంది ఉద్యోగులను నియమించుకునేందుకు సన్నాహాలు చేపట్టింది. వర్చువల్ డిజిటల్ ఆస్తుల బదిలీపై దేశంలో 30 శాతం పన్ను అమలులోకి వచ్చినా ఈ కంపెనీ హైరింగ్ ప్రణాళికలపై దూకుడుగా వెళుతోంది. భారత్‌లో టెకీల నియామకం, పెట్టుబడుల పెంపుపై యోచిస్తున్నామని కాయిన్‌బేస్ వ్యవస్ధాపకులు బ్రైన్ ఆర్మ్‌స్ట్రాంగ్ పేర్కొన్నారు.
ప్రపంచంలో ఆర్ధిక స్వేచ్ఛను మెరుగుపరిచే క్రమంలో క్రిప్టో మెరుగైన టూల్‌గా ముందుకొస్తుందని తాము నమ్ముతున్నామని చెప్పారు. దీన్ని ప్రపంచంలో ఎక్కడనుంచైనా ఎవరైనా సులభంగా వాడే వెసులుబాటు ఉందని అన్నారు. భారత్‌లో క్రిప్టో, వెబ్3 భవిష్యత్‌పై చర్చించేందుకు తమ ఎక్స్ఛేంజ్ ఏప్రిల్ 7న బెంగళూర్‌లో క్రిప్టో కమ్యూనిటీ ఈవెంట్‌ను నిర్వహిస్తోందని చెప్పారు. ఈ ఈవెంట్లో పలువురు ప్రత్యేక అతిధులు పాల్గొంటారని, ఆన్లైన్లో పాల్గొనే వారు రిజిస్టర్ చేసుకోవచ్చని అన్నారు.
భారత్‌లో మెరుగైన డిజిటల్ చెల్లింపుల మౌలిక వసతులున్నాయని కాయిన్‌బేస్ ఇండియన్ టెక్ హబ్‌లో దేశవ్యాప్తంగా 300 మంది పూర్తిస్ధాయి ఉద్యోగులున్నారని వెల్లడించారు. ఇండియా హబ్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడంతో పాటు ఈ ఏడాది వేయిమంది ఉద్యోగులను నియమిస్తామని ఆర్మ్‌స్ట్రాంగ్ వెల్లడించారు. భారత్‌లో క్రిప్టోకు మంచి భవిష్యత్ ఉందని ఈ దిశగా తమ ఈవెంట్ కీలకమైనదని ఆయన చెప్పుకొచ్చారు.