Credit Card | గతంలో వ్యాపారవేత్తలకు, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు, ప్రభుత్వోద్యోగులు, అధికారులకు మాత్రమే అందుబాటులో ఉండేవి క్రెడిట్ కార్డులు. ఇప్పుడు ప్రతి వ్యక్తి సేవింగ్స్ ఖాతా, లావాదేవీల ఆధారంగా దాదాపు అందరి వద్ద క్రెడిట్ కార్డులు ఉన్నాయి. మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువగా క్రెడిట్ కార్డులు వాడుతుంటాయి. అయితే, తొలిసారి క్రెడిట్ కార్డు తీసుకునే వారికి మాత్రం బ్యాంకులు.. ఎంట్రీ లెవల్ బెనిఫిట్లు గల కార్డు మాత్రమే జారీ చేస్తాయి. ఈ తరహా క్రెడిట్ కార్డులు.. మీరు కుటుంబ అవసరాలకు అనుగుణంగా క్రెడిట్ జర్నీ ప్రారంభించడానికి వీలుగా ఉంటాయి.
రివార్డు పాయింట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు, ట్రావెలింగ్ కన్సెషన్లు, ఎయిర్పోర్ట్ లాంజ్ పర్మిషన్ వంటి పలు ఆకర్షణీయ బెనిఫిట్లు.. ఈ ఎంట్రీ లెవల్ క్రెడిట్ కార్డుల్లో లభించవు. అయితే కాలం గడుస్తున్నా కొద్దీ మీ ఆదాయం పెరుగుతూ ఉంటుంది. క్రెడిట్ స్కోర్ మెరుగు పడుతూ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో బ్యాంకులు మీ ఖర్చులకు ఉపకరించేలా స్పెషల్ బెనిఫిట్లు లభించే క్రెడిట్ కార్డుకు మీరు అప్‌గ్రేడ్ అయ్యే చాన్స్ కల్పిస్తాయి.
కానీ, ప్రతి ఒక్కరూ తమ రోజువారీ ఖర్చులను పరిగణనలోకి తీసుకోవాలి. ప్రయాణం, పెట్రోల్, రోజువారీ నిత్యావసర ఖర్చుల షాపింగ్.. ప్రత్యేకించి గ్రాసరీ షాపింగ్ వంటి ఖర్చులు ఉంటాయి. అన్ని క్రెడిట్ కార్డుల్లోనూ జనరల్ బెనిఫిట్లు లభిస్తాయి. ఒక్కో క్రెడిట్ కార్డులో ఒక్కో స్పెషల్ బెనిఫిట్ ఉంటది. కనుక అవసరాలను బట్టి ఆయా క్రెడిట్ కార్డులు వాడుతూ ఉండాలి.
తరుచుగా ప్రయాణాలు చేసేవారికి ట్రావెల్ కార్డు ఉపయుక్తంగా ఉంటది. దీనిపై విమాన టికెట్లు కొనుగోలు చేయడం వల్ల రాయితీ లభిస్తుంది. ఎయిర్పోర్ట్ లాంజ్ల్లో ఉచితంగా ఎంట్రీ పొందొచ్చు. పెట్రోల్ వినియోగానికి కూడా ఫ్యుయల్ కార్డులు ఉన్నాయి. వాహనాలకు పెట్రోల్ లేదా డీజిల్ వాడే వారు.. ఫ్యుయల్తోపాటు రోజువారీ ఖర్చులు ఏయే విభాగాల్లో ఉంటాయో పరిగణనలోకి తీసుకున్నాక.. అందుకు తగినట్లు క్రెడిట్ కార్డు అప్‌గ్రేడ్ చేసుకోవడం ఉత్తమం.
మీరు ఏ కేటగిరి క్రెడిట్ కార్డు అవసరమో తేల్చుకున్న తర్వాత ఆయా బ్యాంకులు, క్రెడిట్ కార్డు జారీ సంస్థలు ఇచ్చే ఆఫర్లు, బెనిఫిట్లను అర్థం చేసుకోవడంతోపాటు వాటి నుంచి వచ్చే బెనిఫిట్లను సరిపోల్చుకోవాలి. ఉదాహరణకు షాపింగ్ కోసం ఉపయోగించే క్రెడిట్ కార్డుపై రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్, రాయితీ ఏ మేరకు లభిస్తుందో చెక్ చేసుకోవాలి.
కొన్ని క్రెడిట్ కార్డు జారీ సంస్థలు ప్రత్యేకమైన బ్రాండ్లపైనే ఆఫర్లు అందిస్తుంటాయి. మరికొన్ని ఆన్లైన్ షాపింగ్‌కు మాత్రమే బెనిఫిట్లు అందిస్తాయి. కొన్ని సంస్థలు బెనిఫిట్లపై గరిష్ట పరిమితులు తీసుకొస్తాయి. ఖర్చులు, రాయితీలకు పొంతన ఉండేలా చూసుకోవాలి. రూ.లక్షల్లో ఖర్చు చేసి, రూ.వందల్లో బెనిఫిట్ల వల్ల నో యూజ్.
క్రెడిట్ కార్డుపై బెటర్ బెనిఫిట్లు ఉన్నాయంటే.. వార్షిక ఫీజు కూడా ఎక్కువగానే ఉంటది. కనుక మీరు చెల్లించే వార్షిక ఫీజు, ఆ క్రెడిట్ కార్డుపై పొందే బెనిఫిట్లకు లింక్ ఉందా.. లేదా.. చెక్ చేసుకోవాలి. కొన్ని క్రెడిట్ కార్డు సంస్థలు నిర్ధిష్ట వ్యయ పరిమితిని నిర్దేశిస్తాయి. ఆ పరిధి దాటి ఖర్చు చేస్తే వార్షిక ఫీజు మాఫీ చేస్తాయి. ఆ స్థాయిలో ఖర్చు ఉంటేనే అటువంటి క్రెడిట్ కార్డులు తీసుకోవాలి. అలాంటి పరిస్థితి లేకపోతే అధిక ఫీజు చెల్లించడం వల్ల ఒనగూడేదేమీ లేదు.
క్రెడిట్ కార్డు అప్‌గ్రేడ్ చేసుకుంటే క్రెడిట్ లిమిట్ కూడా పెరుగుతుంది. క్రెడిట్ కార్డుపై మీకు లభించే క్రెడిట్ లిమిట్ సదరు సంస్థలు పెంచుతాయి. అయినా ఎమర్జెన్సీలో మాత్రమే క్రెడిట్ కార్డు వాడకం ఎంతో ఉపయోగం. కనుక క్రెడిట్ లిమిట్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటే క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో.. దానికి అనుగుణంగా క్రెడిట్ స్కోర్ మెరుగవుతుంది. మీ ఆదాయాన్ని, మీరు అప్‌గ్రేడ్ చేసుకునే క్రెడిట్ కార్డును బట్టి క్రెడిట్ లిమిట్ ఉంటది.
మీరు ప్రస్తుతం వాడుతున్న క్రెడిట్ కార్డుపై వస్తున్న, పొందుతున్న బెనిఫిట్లను ఒకసారి నిశితంగా చెక్ చేసుకున్నాకే ఆ కార్డు అప్‌గ్రేడ్ చేసుకోవాలి. ప్రస్తుతం ఉన్న క్రెడిట్ కార్డుపై వచ్చే బెనిఫిట్ల కంటే అదనపు ప్రయోజనాలు ఉంటేనే ఆ కార్డు అప్‌గ్రేడ్ చేసుకోవాలి. ప్రస్తుత క్రెడిట్ కార్డులో లభించే రివార్డు పాయింట్లు కొత్త క్రెడిట్ కార్డుకు ట్రాన్స్ఫర్ అయ్యేలా చర్యలు తీసుకోవాలి. అలా కాక వాటిని ఉపయోగించుకునే చాన్స్ ఉంటే వాడేసుకోవాలి.