హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : సింగరేణిలో ఉత్పత్తి అవుతున్న జీ-15 గ్రేడ్ బొగ్గును థర్మల్ ప్లాంట్లు తిరస్కరిస్తున్నాయి. ఈ బొగ్గు మాకొద్దు బాబోయ్ అంటున్నాయి. జీ-14 గ్రేడ్ బొగ్గుదీ ఇదే పరిస్థితి. బొగ్గు గ్రాస్ క్యాలరిఫిక్ విలువ 2,800-3,100 మధ్య ఉంటే జీ-15 గ్రేడ్‌గా, 3,100- 3,400గా ఉంటే జీ-14 గ్రేడ్‌గా పరిగణిస్తారు. ఈ తరహా బొగ్గు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఉత్పత్తి అవుతున్నది. సత్తుపల్లిలోని జేవీఆర్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్, ఇల్లందులోని జేకే ఓసీ, సీఎస్పీ, కొత్తగూడెం, మణుగూరుల్లో ఈ రెండు గ్రేడ్ల బొగ్గు ఉత్పత్తి అవుతున్నది. రోజుకు సింగరేణి 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తుండగా, 20 శాతం బొగ్గు ఈ రెండు గ్రేడ్లదే. అయితే తక్కువ నాణ్యతగల ఈ బొగ్గును థర్మల్ ప్లాంట్లు సరఫరా చేయవద్దంటున్నాయి.
సింగరేణి బొగ్గును ఎక్కువగా థర్మల్ పాంట్లు వినియోగిస్తుంటాయి. బొగ్గు సరఫరాకు సింగరేణి పలు సంస్థలతో ఒప్పందాలు కుదర్చుకున్నది. థర్మల్ ప్లాంట్లతో ఏదైతే గ్రేడ్ బొగ్గును సరఫరా చేస్తామని ఒప్పందం జరుగుతుందో.. అదే గ్రేడ్ బొగ్గును సరఫరా చేయాలి. ఇలా చేయలేని పక్షంలో థర్మల్ ప్లాంట్లకు సింగరేణి నష్టపరిహారం కూడా చెల్లించాలి. కాగా, వినియోగదారుల నుంచి ఫిర్యాదులు, థర్మల్ ప్లాంట్లు తిరస్కరణల మధ్య ఈ రెండు గ్రేడ్ల బొగ్గు సరఫరాను సింగరేణి నిలిపివేసింది. అయితే ఈ రెండు గ్రేడ్ల బొగ్గును జీ-5, జీ-6 గ్రేడ్ల బొగ్గులో మిక్సింగ్ చేస్తున్నారు. దీని ద్వారా బొగ్గు నాణ్యతను మెరుగుపరుస్తున్నారన్న ఆరోపణలున్నాయి.