న్యూఢిల్లీ, నవంబర్ 7: నోట్ల రద్దుతో సామాన్యుల్ని అష్టకష్టాలకు లోను చేసిన మోదీ ప్రభుత్వం అటుతర్వాత కరెన్సీ నోట్లను అదేపనిగా ముద్రించి వ్యవస్థలోకి వదిలిపెట్టడంతో ప్రజల వద్ద నగదు భారీగా పెరిగిపోయింది. అక్టోబర్ 21 నాటికి పబ్లిక్ చేతిలో ఉన్న నగదు కొత్త రికార్డుస్థాయి రూ.30.88 లక్షల కోట్లకు చేరినట్టు రిజర్వ్‌బ్యాంక్ తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
దేశంలో నల్లధనాన్ని తగ్గించడానికి రూ.1000, రూ.500 నోట్లను రద్దుచేస్తున్నట్టు 2016 నవంబర్ 8 రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించి, నిత్యావసరాలకు ప్రజలు అల్లాడే పరిస్థితి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి ఇటు స్వదేశంలో నల్ల ధనాన్ని వెలికితీసిన దాఖలేవీ లేవు. అటు విదేశాల నుంచి రప్పించిన బ్లాక్ మనీ సైతం లేదు. రద్దు చేసిన పెద్ద నోట్లకంటే మరింత పెద్దదైన రూ.2000 నోటును ప్రవేశపెట్టడంతో రహస్యంగా కోట్లాది రూపాయల్ని పోగేసుకునే వీలును కల్పించిందీ కేంద్ర ప్రభుత్వం.
రూ.17.7 లక్షల కోట్ల నుంచి..
రోజువారీ లావాదేవీలకు కొత్త డిజిటల్ సాధనాలు రావడంతో డిజిటల్ చెల్లింపులు జోరుగా పెరిగినా రిజర్వ్‌బ్యాంక్ రూ. 500 నోట్లను ఇబ్బడి ముబ్బడిగా ముద్రిస్తునే ఉంది. అవి పబ్లిక్ వద్దకు చేరుతూ ఆరేండ్లుగా వ్యవస్థలో కరెన్సీ క్రమేపీ పెరుగుతూనే వచ్చింది. 2016 నవంబర్ 4 నాటికి రూ.17.7 లక్షల కోట్ల విలువైన కరెన్సీ చలామణీలో ఉన్నట్టు ఆర్బీఐ డాటా వెల్లడిస్తున్నది.