న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: భారత్‌లో డాటా సెంటర్లకు అనూహ్యంగా డిమాండ్ నెలకొంటున్నది. వచ్చే ఆరేండ్లలో 4,900-5000 మెగావాట్ల కెపాసిటీ కలిగిన డాటా సెంటర్లకోసం రూ.1.5 లక్షల కోట్ల మేర పెట్టుబడులు అవసరమవుతాయని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనావేస్తున్నది. 2022-23 నుంచి 2024-25 మధ్యకాలంలో డాటా సెంటర్ల నుంచి వచ్చే ఆదాయంలో 17-19 శాతం వృద్ధి నమోదుకానున్నదని పేర్కొంది. ఇప్పటికే దేశీయ సంస్థలతోపాటు అంతర్జాతీయ సంస్థలు కూడా తమ డాటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాయి.
ఐటీ హబ్‌గా కొనసాగుతున్న హైదరాబాద్..భవిష్యత్తులో డాటా సెంటర్ల కేంద్రం గా మారబోతున్నది. ఇక్కడ అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజాలు తమ డాటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించాయి. మైక్రోసాఫ్ట్, అమెజాన్‌లో వేలాది కోట్ల రూపాయలతో ప్రపంచంలో అతిపెద్ద డాటా సెంటర్లను నెలకొల్పబోతున్నాయి.
వచ్చే ఆరేండ్లలో డాటా సెంటర్ల కెపాసిటీ ఆరు రెట్లు పెరగనున్నది. ఈ సెంటర్ల ఏర్పాటులో ముంబై, హైదరాబాద్, ఢిల్లీ-ఎన్సీఆర్లు 75 శాతం వాటా కలిగివుండనున్నాయి.
– అనుపమ రెడ్డి, ఇక్రా వైస్ ప్రెసిడెంట్