న్యూఢిల్లీ, జనవరి 24: జీవిత బీమా పాలసీదారుల్లో అత్యధికులు వివిధ కారణాలతో తమ పాలసీలను మెచ్యూరిటీకి ముందే సరెండర్ చేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన ఆర్థిక సుస్థిరత నివేదిక 2025లో ఈ మేరకు స్పష్టమైంది. నిజానికి భారతీయ బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ కూడా ఎన్నో ఏండ్ల నుంచి దీనిపట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఇటీవలి తమ వార్షిక నివేదికలోనూ పునరుద్ఘాటించింది. అయితే ఈ నివేదికను మించి తాజా ఆర్బీఐ రిపోర్టులో జీవిత బీమా రంగంలోని నిర్మాణాత్మక సమస్యలు బయటపడటం గమనార్హం.
ఆర్బీఐ వివరాల ప్రకారం.. జీవిత బీమా పాలసీల్లో చెల్లింపులు గత కొన్నేండ్లుగా బాగా పెరిగాయని తేలింది. అయితే మెచ్యూరిటీకి ముందే పాలసీదారులు తమ పాలసీలను సరెండర్ చేయడం, ఉపసంహరించుకోవడమే ఇందుకు కారణమని రుజువైంది. పాలసీ తీసుకునేటప్పుడు ఆశించిన రాబడులు లేకపోవడం కొన్నిసార్లు పాలసీదారులను ఇన్సూరెన్స్ సరెండర్వైపునకు తీసుకెళ్తుండగా, మరికొన్నిసార్లు పాలసీ ప్రీమియం చెల్లింపులు భారంగా మారడం, తీసుకున్న పాలసీలు తమ అవసరాలకు సరిపోవని పాలసీదారులు ఓ నిర్ణయానికి రావడం వంటివి మెచ్యూరిటీకి ముందే ఎగ్జిట్‌కు దారితీస్తున్నాయి.
జీవిత బీమా రంగంలో లబ్ధి పొందలేకపోతున్న పాలసీదారులు.. ఆరోగ్య బీమాలోనూ నష్టపోతున్నారు. క్లెయిమ్‌ల సెటిల్మెంట్ ప్రక్రియ పేలవంగా సాగుతున్నదని నివేదికలు చెప్తున్నాయి మరి. దీంతో పాలసీదారులు ఆరోగ్య బీమా పాలసీలపట్ల ఎంతో అసంతృప్తిగా ఉంటున్నారు. ఈ క్రమంలో బీమా కంపెనీల తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారని ఇండస్ట్రీ పరిశీలకులు చెప్తున్నారు. కొన్ని కంపెనీలు క్లెయిమ్‌లను తప్పించుకోవడానికి అనేక నిబంధనల్ని చూపిస్తున్నాయని, ఆ ఖర్చులు.. ఈ ఖర్చులు పాలసీలో వర్తించవని కొర్రీలు పెడుతున్నాయని, చివరకు జేబులో నుంచి చెల్లింపులు జరుపాల్సి వస్తున్నదని పాలసీదారులూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్బీఐ రిపోర్టు ముఖ్యాంశాలు

కమీషన్ల కోసం బ్యాంకులు, ఏజెంట్లు పాలసీదారులను మభ్యపెట్టి పాలసీలు చేయిస్తున్నారు. పాలసీదారుల కష్టార్జితంతో భారతీయ బీమా వ్యవస్థ.. బీమా సంస్థలు, వాటి పంపిణీ వ్యవస్థలకు ఎంత ప్రయోజనకరంగా మారిందో ఆర్బీఐ తాజా రిపోర్టు తేటతెల్లం చేస్తున్నది. ముఖ్యంగా దేశంలో బీమా.. ప్రైవేట్ జీవిత బీమా, జీవిత బీమాయేతర సంస్థలకే లాభిస్తున్నది. పాలసీదారులకు సంప్రదాయ జీవిత బీమా పాలసీలతో ఇన్సూరెన్స్ కంపెనీలు ఎర వేస్తున్నాయి. తొలి ఏడాది ఆ ఉచ్చులోపడే పాలసీదారులు.. ఆ తర్వాత తప్పించుకోలేక భారంగా మారినా వాటిని కొనసాగించాల్సి వస్తున్నది.
-ఎక్స్‌లో మోనిక హలన్, ప్రముఖ రచయిత్రి, వక్త

ఈ అధిక సరెండర్ రేట్లు.. పాలసీదారులు ఏవో అవసరాలతో తమ పాలసీలను ఉపసంహరించు కుంటుండటం వల్ల ఏర్పడినవి కావు. దీర్ఘకాలిక కస్టమర్లను పెంచుకోవడం కోసం, బీమా పాలసీల అమ్మకాలను వృద్ధి చేసుకోవడానికి ఇన్సూరర్లు అవలంబిస్తున్న కమీషన్ ఆధారిత భారీ పంపిణీ వ్యవస్థల్లో పాలసీదారులు ఇరుక్కుపోవడం వల్ల ఏర్పడుతున్నవి. భారతీయ బీమా రంగం విచ్ఛిన్నమైంది. అది పాలసీదారులకు ప్రయోజనకరంగా ఉండట్లేదు.
-ఆర్బీఐ నివేదిక

నియమ-నిబంధనలు, షరతులు లేదా పాలసీదారులకు సదరు పాలసీలు సరైనవేనా? అన్నది తెలియపర్చకుండా, చూడకుండానే బీమా పాలసీలను కంపెనీలు అమ్మేస్తున్నాయి. దీనివల్ల పాలసీదారుల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. ముందస్తు పాలసీ ఉపసంహరణలతో పాలసీదారులకే ఎక్కువ నష్టం వాటిల్లుతుంది.
-వార్షిక రిపోర్టులో ఐఆర్డీఏఐ