న్యూఢిల్లీ, డిసెంబర్ 9: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి 6 నెలల్లో (ఏప్రిల్-సెప్టెంబర్) దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు రైటాఫ్ చేసిన రుణాల విలువ రూ.42,035 కోట్లుగా ఉన్నది. ఈ మేరకు సోమవారం పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి ప్రకటించారు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అత్యధికంగా రూ.8,312 కోట్ల రుణాలను ఖాతా పుస్తకాల నుంచి తొలగించిందని లోక్‌సభలో ఓ లిఖితపూర్వక సమాధానంలో మంత్రి పేర్కొన్నారు. ఆ తర్వాత స్థానాల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (రూ.8,061 కోట్లు), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (రూ.6,344 కోట్లు), బ్యాంక్ ఆఫ్ బరోడా (రూ.5,925 కోట్లు) ఉన్నాయన్నారు. కాగా, ‘రైటాఫ్ అంటే రుణాల రద్దు కాదు. కాబట్టి దీనివల్ల రుణగ్రహీతకు వచ్చే లాభమేమీ ఉండబోదు.
రుణాలు తీసుకున్నవారు బ్యాంకులకు బకాయిపడే ఉంటారు. ఆ మొండి బాకీల వసూలుకు బ్యాంకులు రకరకాల పద్ధతుల్లో ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాయి’ అని మంత్రి పంకజ్ చౌధరి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇదిలావుంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ ఏప్రిల్-సెప్టెంబర్‌లో వసూలు చేసిన బకాయిల విలువ రూ.37,253 కోట్లుగా ఉన్నట్టు కూడా ఆయన తెలిపారు. ఇక గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో ప్రభుత్వ రంగ బ్యాంకులు రైటాఫ్ చేసిన రుణాల విలువ రూ.1.14 లక్షల కోట్లుగా ఉన్నది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2022-23) ఇది రూ.1.18 లక్షల కోట్లుగా ఉండటం గమనార్హం. దీంతో రెండున్నరేండ్లలో ప్రభుత్వ బ్యాంకుల లోన్ రైటాఫ్‌లు రూ.2.74 లక్షల కోట్లపైనేనని తెలుస్తున్నది. వీటిలో ఎక్కువ కార్పొరేట్ల రుణాలే ఉండటం గమనార్హం.