Rupee | ముంబై, డిసెంబర్ 19: డాలర్ ధాటికి రూపాయి కుప్పకూలింది. గురువారం కీలకమైన 85 మార్కు దిగువకు పడిపోయింది. చారిత్రక కనిష్ఠ స్థాయిని తాకుతూ తొలిసారి 85.13 వద్దకు మారకపు విలువ చేరింది. ఈ ఒక్కరోజే డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ ఏకంగా 19 పైసలు క్షీణించడం గమనార్హం. దీంతో ఈ వారం మొత్తంగా మూడు రోజుల్లో 33 పైసలు నష్టపోయినైట్టెంది. సోమవారం 11 పైసలు కోల్పోయిన విషయం తెలిసిందే. కాగా, ఉదయమే ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ వద్ద రూపాయి 85.14 వద్ద మొదలైంది. చివరకు కాస్త కోలుకుని 85.13 వద్ద ముగిసింది.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ బుధవారం నిర్వహించిన ద్రవ్యసమీక్షలో పావు శాతం వడ్డీరేట్లను తగ్గించింది. అయితే ఈ సందర్భంగా వచ్చే ఏడాది రెండుసార్లు మాత్రమే వడ్డీరేట్ల తగ్గింపులుండొచ్చని ప్రకటించింది. గతంలో నాలుగుసార్లు తగ్గిస్తామని చెప్పగా.. దాన్నిప్పుడు సగానికి కుదించేసింది. దీంతో ఫెడ్ రిజర్వ్ కఠిన ద్రవ్య వైఖరికి వెళ్తుందన్న సంకేతాలు మార్కెట్‌కు స్పష్టంగా వెళ్లాయి. ఫలితంగా డాలర్‌కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఇది భారతీయ రూపీపై సహజంగానే ప్రభావం చూపిందని ఫారెక్స్ ట్రేడర్లు విశ్లేషిస్తున్నారు.
డాలర్ ముందు అంతకంతకూ బలహీనపడుతున్న రూపాయి.. భారత ఆర్థిక వ్యవస్థను గట్టిగానే దెబ్బతీస్తున్నది. ఇప్పటికే మునుపెన్నడూ లేనివిధంగా గత రెండు నెలలుగా క్షీణిస్తూపోతున్న రూపీ.. తాజాగా 85 మార్కును దాటేసింది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే మరింతగా నష్టపోవచ్చన్న అంచనాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే భారత్‌కు విదేశాల నుంచి వచ్చే దిగుమతులు ఇంకా ఖరీదెక్కడం ఖాయమే. దీనివల్ల ద్రవ్యోల్బణం మరింత విజృంభించగలదు.
ఫలితంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీరేట్లను ఇప్పటికే ఉన్న గరిష్ఠ స్థాయిల్లోనో లేక ఇంకా ఎక్కువకో చేర్చడానికి వీలున్నది. దాదాపు రెండేండ్లుగా రెపోరేటును 6.5 శాతం వద్దే ఆర్బీఐ ఉంచుతున్న సంగతి విదితమే. దీంతో ఇదే స్థాయిలోనో లేక పెరిగితే గనుక కీలక రంగాల్లో వృద్ధిరేటు దారుణంగా పడిపోవచ్చన్న ఆందోళనలు వ్యాపార, పారిశ్రామిక రంగాల నుంచి వ్యక్తమవుతున్నాయి. సామాన్యలు, ఇతర రుణగ్రహీతలపై ఈఎంఐల భారం కూడా తీవ్రమయ్యే ప్రమాదం ఉందని బ్యాంకింగ్ వర్గాలూ హెచ్చరిస్తున్నాయి.
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ జీవనకాల కనిష్ఠాలకు పతనమైన క్రమంలో ఆర్బీఐ జోక్యం చేసుకుంటే పరిస్థితులు కుదుటపడవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. డాలర్లు మార్కెట్లోకి పెద్ద మొత్తంలో విడుదలైతే రూపాయి తిరిగి కోలుకుంటుందని అంటున్నారు. అయితే దేశంలో గతకొద్దిరోజులుగా డాలర్ నిల్వలు పడిపోతుండటం కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో దేశీయంగా డాలర్ నిల్వలు 704.885 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. కానీ 2 నెలల్లోనే సుమారు 30 బిలియన్ డాలర్లు కరిగిపోయాయి మరి.