అమెరికా ఫెడ్ మార్కెట్ అంచనాలకు అనుగుణంగా వడ్డీ రేట్లను 75 బేసిస్ పాయింట్లు పెంచినా, సమీప భవిష్యత్తులో రేట్ల పెంపు నిలిచిపోతుందన్న ఇన్వెస్టర్ల ఆశల్ని వమ్ము చేసింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రేట్ల పెంపు కొనసాగుతుందంటూ ఫెడ్ చైర్మన్ ప్రకటించడంతో అమెరికా మార్కెట్ తీవ్ర ఒడిదుడులకు లోనయ్యాయి. ఈ నేపథ్యంలో దేశీయ సూచి నిఫ్టీ మాత్రం గతవారం 330 పాయింట్లు లాభపడి 18,117 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం సైతం మార్కెట్ ట్రెండ్ పాజిటివ్‌గా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
స్టాప్ లాస్ 18,000
కీలకమైన అన్ని మూవింగ్ ఏవరేజ్ల పైన ప్రస్తుత నిఫ్టీ ట్రేడవుతున్నందున, అప్‌ట్రెండ్ కొనసాగవచ్చని ఈక్విటీరీసెర్చ్ ఆసియా వ్యవస్థాపకుడు మిలన్ వైష్ణవ్ తెలిపారు. తక్షణ అవరోధమైన 18,200 స్థాయిని బలంగా దాటితే 18,400 పాయింట్ల వద్దకు, అటుపైకి కూడా పెరగవచ్చని అంచనా వేశారు. 17,750-17,700 పాయింట్ల శ్రేణి వద్ద బలమైన మద్దతు ఉన్నదన్నారు. స్వల్పకాలికంగా మార్కెట్ ట్రెండ్ పాజిటివ్‌గా ఉంటుందని యాక్సిస్ సెక్యూరిటీస్ ఈక్విటీ హెడ్ రాజేష్ పాల్వియా చెప్పారు. తాము 18,000 పాయింట్ల స్థాయిని స్టాప్ లాస్‌గా పరిగణించి మార్కెట్లో పాలుపంచుకుంటామని, ఈ స్థాయిపైన నిఫ్టీ 18,250, 18,400 పాయిం ట్ల స్థాయిని అందుకోవచ్చని అంచనా వేశారు.