Gold Price | గత కొంతకాలంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. దేశాల మధ్య ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి కారణంగా బంగారానికి డిమాండ్ పెరిగింది. అయితే, బంగారం రేటు పెరుగుతుండడంతో వినియోగదారులు కొత్తగా బంగారాన్ని కొనుగోలు చేయడం లేదని హోల్‌సేల్ గోల్డ్ జ్యువెలరీ అసోసియేషన్‌కు చెందిన మహేశ్ బాఫ్నా తెలిపారు. బంగారు ఆభరణాలు, నాణేలను రీసైక్లింగ్ చేసి నగదును తీసుకొని కొత్త ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారని.. కొంతకాలంగా ఇదే ధోరణి కనిపిస్తుందని పేర్కొన్నారు. 20శాతం మంది వినియోగదారులు పాత ఆభరణాలను మార్పిడి చేసి కొత్త ఆభరణాలను తీసుకుంటున్నారు. భవిష్యత్తులో తమ పిల్లల వివాహం దృష్ట్యా ప్రత్యేకంగా కొందరు ఈ తరహాలో కొనుగోళ్లు జరుపుతున్నారన్నారు. భవిష్యత్‌లో బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు.
భారత్‌లో దేశీయ బంగారంలో 11శాతం మాత్రమే రీసైకిల్ అవవుతున్నట్లుగా వ్యాపారులు చెబుతున్నారు. మిగతా బంగారం బయటి నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు తెలుపుతున్నారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం.. గతేడాదిలో భారత్‌లో బంగారం 114.3 టన్నులు రీస్లైకింగ్ జరిగింది. అంతకు ముందు ఏడాదిలో 117.1 టన్నులుగా ఉన్నది. జవేరి బజార్‌కు చెందిన అంబికా జువ్యెలర్స్ వ్యాపారి పరాగ్ జైన్ మాట్లాడుతూ రీసైక్లింగ్ బంగారం ధరలో హెచ్చతుగ్గులతో ముడిపడి ఉందన్నారు. తాము 40శాతం రీసైకిల్ చేసిన బంగారాన్ని ఉపయోగిస్తున్నామన్నారు. ప్రస్తుతం ధరలు మండిపోతుండడంతో వినియోగదారులు రీసైకిల్‌కి వస్తున్నారని.. అదే సమయంలో పాత ఆభరణాలను కొత్త డిజైన్లుగా చేయించుకుంటున్నారన్నారు. ఎక్కువ బంగారంతో ఉన్న వస్తువుతో రెండు ఆభరణాలను తయారు చేయించుకుంటున్నారన్నారు.
దేశంలోని అనేక పెద్ద రిటైల్ జ్యువెలరీ బ్రాండ్స్ ఆభరణాల తయారీలో రీసైకిల్ చేసిన బంగారాన్ని ఉపయోగిస్తాయి. మియా బై తనిష్క్, జాయ్ అలుకోస్, గోల్డ్ మలబార్ డైమండ్ వంటి కంపెనీలు రీసైకిల్ చేసిన బంగారాన్ని ఉపయోగిస్తాయి. ముత్తూట్ ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ కేయూర్ షా మాట్లాడుతూ బంగారు రీసైక్లింగ్ వ్యాపారంలో చాలా సవాళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. బంగారు ఆభరణాలను రీసైకిల్ చేసినప్పుడు సరైన ధర పొందలేరని.. దీనికి కారణం అసంఘటిత రంగంలోని రీసైక్లర్లు బంగారం క్వాలిటీని సరిగ్గా పరిశీలించకపోవడమేనన్నారు. ఈ పరిస్థితుల్లో వినియోగదారులు నిరాశకు గురవుతారన్నారు.
రీసైక్లింగ్ సమయంలో బంగారం స్వచ్ఛతను తనిఖీ చేయడం ముఖ్యమని.. దీని కోసం ముత్తూట్ గోల్డ్ పాయింట్‌ను ప్రారంభించిందని చెప్పారు. దాంతో వినియోగదారులకు బంగారాన్ని పారదర్శకంగా విక్రయించేందుకు ఓ వేదికను తీసుకువచ్చామన్నారు. ఇక్కడ ఏఆర్ఎఫ్ యంత్రాల ద్వారా శాస్త్రీయ పరీక్ష తర్వాత బంగారాన్ని తీసుకొని.. సరైన ధరను చెల్లిస్తారన్నారు. మెట్రోలు, టైర్ 2, టైర్ 3 నగరాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా బంగారం దిగుమతులను తగ్గించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇందులో పాత బంగారాన్ని రీసైక్లింగ్ చేయడం ప్రధానమని ఆయన అన్నారు. ఎందుకంటే దేశ డిమాండ్‌లో దాదాపు 99 శాతం దిగుమతుల ద్వారా తీరుతుంది. ప్రైవేట్ వ్యక్తులు, దేవాలయాల వద్ద 30వేల టన్నులకుపైగా బంగారం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) అంచనా వేసింది. ఇందులో ఒక్క శాతం కూడా రీసైకిల్ అయినా దిగుమతులు 30-40 శాతం తగ్గుతాయని వెల్లడించారు.