హైదరాబాద్, ఏప్రిల్ 2 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు భారత రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ అనిశ్చితుల కారణంగా ఇండియన్ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకే విదేశీ మదుపర్లు విముఖత వ్యక్తం చేస్తున్నారు. దీంతో దేశంలో ఇండ్ల నిర్మాణం, విక్రయాలు ఆశాజనకంగా లేవు. ఈ మేరకు స్థిరాస్తి సేవల సంస్థ కొలియర్స్ ఒక నివేదికలో వెల్లడించింది. మరోవైపు, దేశంలో ఇండ్ల విక్రయాలు 18 త్రైమాసికాల కనిష్ఠానికి పడిపోయినట్టు రియల్ ఎస్టేట్ ఎనలటిక్స్ సంస్థ ప్రాప్ఈక్విటీ పేర్కొంది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో (జనవరి-మార్చి) దేశంలోని 9 నగరాల్లో ఇండ్ల విక్రయాలు 98,761 యూనిట్లకు మాత్రమే పరిమితమైనట్టు వెల్లడించింది.
దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలోకి విదేశీ సంస్థాగత పెట్టుబడులు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఈ మేరకు కొలియర్స్ వెల్లడించింది. గత త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో (జనవరి-మార్చి) విదేశీ పెట్టుబడులు 75 శాతం మేర క్షీణించినట్టు వెల్లడించింది. 2025 చివరి త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్) విదేశీ మదుపర్ల నుంచి భారత రియల్ ఎస్టేట్ రంగం రూ. 14,876 కోట్లు పెట్టుబడులను ఆకర్షించగా, ప్రస్తుతం ఇది 75 శాతం మేర క్షీణించి రూ. 3,719 కోట్లకు పరిమితమైనట్టు నివేదిక వెల్లడించింది. మొత్తంగా దేశీయ, విదేశీ మదుపర్ల నుంచి నిరుడు చివరి త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్, 2025) రూ. 39,039 కోట్ల మేర పెట్టుబడులు రాగా, ప్రస్తుతం ఇది 61 శాతం మేర క్షీణించి రూ. 14,872 కోట్లకు పడిపోయినట్టు వెల్లడించింది. పెట్టుబడుల్లో క్షీణత నమోదవ్వడంతో దేశంలో ఇండ్ల నిర్మాణాలు, విక్రయాలు ఆశాజనకంగా లేవని కొలియర్స్ పేర్కొంది.
దేశంలో ఇండ్ల విక్రయాలు భారీగా పడిపోయినట్టు రియల్ ఎస్టేట్ ఎనలటిక్స్ సంస్థ ప్రాప్ఈక్విటీ పేర్కొంది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో (జనవరి-మార్చి) దేశంలోని 9 నగరాల్లో ఇండ్ల విక్రయాలు 98,761 యూనిట్లకు మాత్రమే పరిమితమైనట్టు పేర్కొం ది. లక్ష యూనిట్లలోపు విక్రయాలు పడిపోవడం 18 త్రైమాసికాల తర్వాత ఇదే ప్రప్రథమమని వెల్లడించింది. 2025 చివరి త్రైమాసికంలో 1,05,527 యూనిట్ల విక్రయాలు జరగ్గా, ప్రస్తుతం 13 శాతం మేర తగ్గి 98,761 యూనిట్లకు పడిపోయినట్టు వివరించింది. పశ్చిమాసియా సంక్షోభం కొనుగోలు సెంటిమెంట్లను దెబ్బతీసినట్టు పేర్కొంది.

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు ధరలు, వాణిజ్యం, కమోడిటీ మార్కెట్లో అస్థిరత నెలకొన్నది. దీంతో రియల్ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టేందుకు విదేశీ మదుపర్లు ఆసక్తి చూపించడం లేదు. అయితే, ఈ పరిస్థితి తాత్కాలికంగానే ఉంటుందని భావిస్తున్నాను.
– కొలియర్స్ ఇండియా సీఈవో బాదల్ యగ్నిక్
