ముంబై, అక్టోబర్ 25: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్‌పడింది. వరుసగా ఏడు రోజులుగా పెరుగుతూ వచ్చిన సూచీలకు ఆసియా మార్కెట్లు బలహీనంగా ట్రేడవడం, విదేశీ నిధులు వెళ్లిపోవడంతో ప్రతికూల ప్రభావం చూపింది. ప్రారంభంలో భారీగా పెరిగినప్పటికీ చివర్లో నష్టాల్లోకి జారుకున్నాయి. 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 287.70 పాయింట్లు నష్టపోయి 59,543.96 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 60 వేలు దాటిన సూచీ చివర్లో నష్టపోయింది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 74.40 పాయింట్లు తగ్గి 17,656.35 వద్ద స్థిరపడింది. మార్కెట్లో నెస్లె షేరు ధర 2.83 శాతం పడిపోయి టాప్ లూజర్‌గా నిలిచింది. దీంతోపాటు హిందుస్థాన్ యునిలీవర్, బజాజ్ ఫిన్సర్వ్, కొటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్‌లు నష్టపోయాయి.
83.5 స్థాయికి రుపీ
రూపాయి విలువ ఈ ఏడాది మరింత పడిపోయే ప్రమాదం ఉన్నదని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం 82-83 స్థాయిలో కదలాడుతున్నదని, ఈ ఏడాది డిసెంబర్ వరకు 83-83.5 స్థాయికి పడిపోవచ్చని ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీ హెడ్ ఆర్నాబ్ తెలిపారు. ఫెడ్ వరుసగా వడ్డీరేట్లను పెంచుతుండటంతో గ్లోబల్ మార్కెట్లో డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొంటుందన్నారు. మంగళవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 7 పైసలు పెరిగి 82.71 వద్ద ముగిసింది.