న్యూఢిల్లీ, డిసెంబర్ 20: స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ మరో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నది. కమోడిటీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారిని ప్రోత్సహించడానికి భారీ సంస్కరణలకు సిద్ధమవుతున్నది. ఈ విషయాన్ని సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే స్పష్టంచేశారు. కమోడిటీ పార్టిసిపెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీపీఏఐ) 11వ కన్వెన్షన్‌లో ఆయన మాట్లాడుతూ..అగ్రి కమోడిటీ డెరివేటివ్ మార్కెట్లో తీసుకొచ్చే సంస్కరణలపై సూచనలు చేయవచ్చునని, సెబీ ఇప్పటికే ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. కమోడిటీ మార్కెట్లో ఇనిస్టిట్యూషన్ పెట్టుబడిదారుల సంఖ్యను మరింత పెంచేందుకు కీలక చర్యలు తీసుకుంటున్నట్టు, అలాగే జీఎస్టీకి సంబంధించిన సమస్యలను ఇప్పటికే పరిష్కరించినట్టు చెప్పారు. కీలక సంస్కరణలపై చర్చించడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.
ఈ నిపుణుల బృందాలు..కమోడిటీ సంస్థల మార్జిన్లు, స్థాన పరిమితులు, డెలివరి-సెటిల్మెంట్ మెకానిజానికి సంబంధించి నియంత్రణ చట్టాన్ని మార్కెట్ సమగ్రతను ప్రభావితం చేయకుండా కులంకుషంగా చర్చించనుఆన్నరు. వ్యవసాయేతర వస్తువుల ఉత్పన్నాలను సమీక్షించడానికి ఏర్పాటు చేయబోతున్న కమిటీ వివరాలను త్వరలో ప్రకటించనున్నట్టు ఆయన చెప్పారు. ఇందుకు సంబంధించి రిజర్వుబ్యాంక్, బీమా నియంత్రణ మండలి ఐఆర్‌డీఏఐతో కలిసి పనిచేస్తున్నట్టు, తద్వారా బ్యాంకులు, బీమా సంస్థలు కూడా కమోడిటీ డెరివేటివ్ సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేయడానికి వీలు పడనున్నదన్నారు.
కమోడిటీ మార్కెట్లోకి నిధుల ప్రవాహాన్ని పెంపొందించడంలో భాగంగా కీలక చర్యలు తీసుకుంటున్నట్టు, ముఖ్యంగా జీఎస్టీకి సంబంధించిన సమస్యలను వెనువెంటనే పరిష్కరించడానికి ప్రభుత్వ ఉన్నతాధికారులతో రోజువారిగా చర్చలు జరుపుతున్నట్టు పాండే చెప్పారు. మార్కెట్ నియంత్రణ మండలి, సరళీకృత విధానం, ప్రస్తుతం స్టాక్ బ్రోకర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న కామన్ రిపోర్టింగ్ పోర్టల్‌ను కమోడిటీ బ్రోకర్లకు కూడా విస్తరించాలని యోచిస్తున్నట్టు చెప్పారు. దీంతోపాటు రైతులు, వారి ఉత్పత్తులు, ఎగుమతులు-దిగుమతుల గురించి వారికి చైతన్యం కలిగించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అలాగే ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్కు సంబంధించి త్వరలో మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
జీజీ ఇంజినీరింగ్ లిమిటెడ్‌పై సెబీ రూ.50 లక్షల జరిమానా విధించింది. కంపెనీకి సంబంధించిన షేర్లను తారుమారు చేసినందుకుగాను నలుగురుపై ఈ జరిమానా వేసింది. వీరిలో మనీష్ మిష్రా, సునీల్ భండారి, రేఖ భండారి, అన్షు మిష్రా ఉన్నారు.