న్యూఢిల్లీ, అక్టోబర్ 27: ఇప్పటికే దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్యను విలీనాల పేరిట తగ్గించేసిన మోదీ సర్కారు.. ఇక ఆ మిగిలిన బ్యాంకుల్లో తమ వాటాలనూ కుదించాలని చూస్తున్నది. దాదాపు గడిచిన 12 ఏండ్లలో ఎన్నో ప్రభుత్వ బ్యాంకులు కనుమరుగయ్యే నిర్ణయాలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు మరో కీలక నిర్ణయం దిశగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తున్నది మరి. ఇందులో భాగంగానే సర్కారీ బ్యాంకుల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)కున్న పరిమితిని ఏకంగా 49 శాతానికి పెంచే వీలున్నట్టు సమాచారం. ఇప్పుడున్న దానితో పోల్చితే ఇది రెట్టింపునకుపైగా కావడం గమనార్హం. ప్రస్తుతం 20 శాతానికి మించి ప్రభుత్వ బ్యాంకుల్లో విదేశీ పెట్టుబడులు ఉండరాదన్నది నిబంధన.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎఫ్‌డీఐ పరిమితిని పెద్ద ఎత్తున పెంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)తో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతున్నదని విశ్వసనీయ సమాచారం. నిజానికి మొదట్నుంచీ దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉనికిని ప్రశ్నార్థకం చేసేలాగే మోదీ సర్కారు ముందుకెళ్తున్నది. ఇప్పటికే ఐడీబీఐ బ్యాంక్‌ను ప్రైవేటీకరణ వైపునకు తీసుకెళ్లగా, ఎస్బీఐ అనుబంధ బ్యాంకులతోపాటు, భారతీయ మహిళా బ్యాంకును విలీనం చేసేసింది. మిగతా బ్యాంకులనూ ఆయా బ్యాంకుల్లో కలిపేసింది. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి కాకముందు దేశంలో 27 ప్రభుత్వ బ్యాంకులుండేవి. ఇప్పుడవి 12కు పడిపోయాయి. వీటిని కూడా విలీనం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు విదేశీ సంస్థలకు ప్రభుత్వ బ్యాంకుల వాటాలను అమ్మే యోచన చేస్తున్నారు. ఆర్బీఐ ఆమోదం లభిస్తే చాలా బ్యాంకులు విదేశీ గుప్పిట్లోకి వెళ్లడం ఖాయమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
దేశంలోని ఆయా ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఇప్పటికే పలు విదేశీ కంపెనీలు మెజారిటీ వాటాలను హస్తగతం చేసుకున్నాయి. ఇటీవలే ఆర్బీఎల్ బ్యాంక్‌లో దుబాయ్‌కి చెందిన ఎమిరేట్స్ ఎన్బీడీ 3 బిలియన్ డాలర్లతో 60 శాతం వాటాను సొంతం చేసుకున్నది. అలాగే యెస్ బ్యాంక్‌లో జపాన్ ఆధారిత సుమిటొమో మిట్సు బ్యాంకింగ్ కార్ప్ 1.6 బిలియన్ డాలర్లతో 20 శాతం వాటాను దక్కించుకున్నది. ఆ తర్వాత మరో 4.99 శాతం వాటానూ చేజిక్కించుకున్నది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వ రంగ బ్యాంకులపైనా విదేశీ సంస్థాగత మదుపరుల కన్ను పడుతున్నది. దీనికి తగ్గట్టే కేంద్ర ప్రభుత్వ చర్యలు ఉంటుండటం అటు బ్యాంకింగ్ పరిశ్రమను, ఇటు ఆర్థిక రంగ నిపుణులను ఒకింత కలవరపాటుకు గురిచేస్తున్నదిప్పుడు. ప్రస్తుతం ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో విదేశీ పెట్టుబడులకున్న గరిష్ఠ పరిమితి 74 శాతంగా ఉన్నది.
ప్రభుత్వ బ్యాంకుల్లో విదేశీ పెట్టుబడులకున్న పరిమితిని 49 శాతానికి పెంచినా.. ప్రభుత్వ వాటాను 51 శాతంగా అలాగే ఉంచాలని కేంద్రం భావిస్తున్నది. అయితే పెరిగే విదేశీ సంస్థల వాటా.. భారతీయ బ్యాంకుల్లో వాటి పెత్తనానికి దారితీయగలదన్న ఆందోళనలైతే కనిపిస్తున్నాయి. ఏ రంగంలోనైనా ప్రభుత్వ సంస్థలు సేవా దృక్పథంతో పనిచేస్తుంటాయని, అయితే ప్రైవేటీకరణ.. సంస్థ పనితీరును వ్యాపారపరంగా మార్చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వ బ్యాంకుల సేవలు అట్టడుగు ప్రజలు, గ్రామీణ ప్రాంత వాసుల అవసరాలకు అనుగుణంగా ఉంటాయని, విదేశీ సంస్థల వాటాలు పెరిగితే ఈ ఆశయానికి దెబ్బేనని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి సర్కారీ బ్యాంకుల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తీరు మారకపోతే.. పేద, మధ్యతరగతి ప్రజలకు బ్యాంకింగ్ సేవలు మున్ముందు ఖరీదెక్కడం ఖాయమేనన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతుండటం గమనార్హం.

గమనిక: భారతీయ స్టాక్ ఎక్సేంజీల వివరాల ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ 30నాటికి ఆయా ప్రభుత్వ బ్యాంకుల్లో విదేశీ సంస్థలకున్న వాటాల వివరాలివి.