న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: ఈ ఏడాది ఆగస్టు నెలలో విమానాల్లో ప్రయాణించిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ముగిసిన నెలలో దేశీయ ఎయిర్ పాసింజర్ ట్రాఫిక్ 22.81 శాతం వృద్ధితో 1.24 కోట్లకు చేరినట్టు డైరెక్టర్ జనర ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది.
బడ్జెట్ ఎయిర్‌లైన్స్ ఇండిగోలో 78.67 లక్షల మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించడంతో మొత్తం దేశీ విమానయాన మార్కెట్లో ఈ సంస్థ 63.3 శాతం వాటాను కనపర్చిందని డీజీసీఏ వెల్లడించింది. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం నుంచి టాటా గ్రూప్ టేకోవర్ చేసిన ఎయిర్ ఇండియా 12.12 లక్షలమందిని గమ్యస్థానాలకు చేరవేయగా, మరో టాటా గ్రూప్ సంస్థ ఏఐఎక్స్ కనెక్ట్‌లో (గతంలో ఎయిర్ ఆసియా ఇండియా) 9.78 లక్షల మంది ప్రయాణించారు.