న్యూఢిల్లీ, నవంబర్ 16: దేశీయంగా కార్యకలాపాలు సాగిస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీ) సంఖ్య 2025 నాటికి 1,900లకు చేరుకోవచ్చని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ సౌత్ ఏషియా గురువారం విడుదల చేసిన ఓ నివేదికలో అంచనా వేసింది. అలాగే అప్పటికల్లా మొత్తం ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో 35-40 శాతం వాటా వీటిదే ఉండొచ్చన్నది. ‘ఇండియాస్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్-చార్టింగ్ ఏ న్యూ టెక్నాలజీ ఎరా’ పేరిట ఈ రిపోర్టును సీబీఆర్ఈ తెచ్చింది. భారత్‌లో జీసీసీల వృద్ధి, వాటి విస్తరణకు దోహదం చేస్తున్న అంశాలు, లీజింగ్ ప్రాధాన్యతల్ని ఇందులో వివరించింది. ‘దేశంలో ఇప్పుడున్న దాదాపు 1,580 జీసీసీలు.. 2025కల్లా సుమారు 1,900లకు పెరగవచ్చు. ఈ వ్యవధిలో జీసీసీ లీజింగ్ కార్యకలాపాల వాటా కూడా మొత్తం ఆఫీస్ లీజుల్లో 35-40 శాతానికి చేరుకోవచ్చు’ అని సదరు నివేదికలో సీబీఆర్ఈ చెప్పింది.
అంతర్జాతీయ స్థాయిలో జీసీసీల ఏర్పాటుకు భారత్ ఇంతలా అనుకూలంగా మారడానికి కారణాలనూ సీబీఆర్ఈ ఈ సందర్భంగా వివరించింది. ఇతర దేశాలతో పోల్చితే ఇక్కడ జీసీసీల ఏర్పాటుకయ్యే ఖర్చు తక్కువగా ఉండటం, నైపుణ్యం-ప్రతిభ కలిగిన యువతకు కొదవ లేకపోవడంతో భారత్.. జీసీసీలకు హాట్ ఫేవరేట్‌గా మారిపోయిందని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే జీసీసీ హబ్‌లుగా ఎదుగుతున్న బ్రెజిల్, చిలీ, చైనా, చెక్ రిపబ్లిక్, హంగేరి, ఫిలిప్పీన్స్, పోలాండ్ తదితర దేశాలకన్నా భారతే ఇప్పుడు మెరుగ్గా గ్లోబల్ కంపెనీలకు కనిపిస్తున్నదని చెప్పింది. జనవరి-జూన్‌లో దేశంలోని టాప్-6 నగరాల్లో ఆఫీస్ స్పేస్ లీజుల్లో 38 శాతం వాటాను ఆక్రమించాయన్నది. ఇది 98 లక్షల చదరపు అడుగులకు సమానమని పేర్కొన్నది.
ఈ ఏడాది ప్రథమార్ధం (జనవరి-జూన్)లో దేశవ్యాప్తంగా జరిగిన జీసీసీ లీజుల్లో హైదరాబాద్, బెంగళూరు, చెన్నైల వాటానే 77 శాతానికిపైగా ఉందని తాజా రిపోర్టులో సీబీఆర్ఈ స్పష్టం చేసింది. దీంతో దేశ, విదేశీ సంస్థలు హైదరాబాద్‌లో ఆఫీసులను ఏర్పాటు చేయడానికి క్యూ కడుతుండటం కలిసొస్తున్నదని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే బడా కంపెనీలెన్నో హైదరాబాద్‌లో కొలువుదీరిన విషయం తెలిసిందే. కాగా, ఉత్తర అమెరికాకు చెందిన సంస్థలు.. భారత్‌లో జీసీసీల ఏర్పాటుకు అమితాసక్తిని ఇంకా ప్రదర్శిస్తూనే ఉన్నాయని సీబీఆర్ఈ తెలిపింది.