వడ్డీ రేట్ల తగ్గింపు సంకేతాలతో యూఎస్ ఫెడ్ మరింత బలాన్ని ఇవ్వడంతో నెలరోజులుగా జరుగుతున్న మార్కెట్ ర్యాలీ మరింత స్పీడందుకుంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ-50 ఇండెక్స్ గతవారంలో 488 పాయింట్లు పెరిగి ఆల్టైమ్ రికార్డుస్థాయి 21,457 పాయింట్ల వద్ద నిలిచి, వరుసగా ఏడో వారంలో సైతం లాభాలతో ముగిసింది. ఈ వారంలో కూడా బుల్ట్రెండ్ కొనసాగుతుందన్న అంచనాల్ని మెజారిటీ టెక్నికల్ అనలిస్టులు వెల్లడించారు. గ్యాప్ అప్ ఓపెనింగ్లతోపాటు ఇంట్రాడే ఒడిదుడుకులు తక్కువగా ఉండటం బుల్ట్రెండ్ పటిష్ఠతను సూచిస్తున్నదని సామ్కో వెంచర్స్ సీఈవో జిమిత్ మోదీ తెలిపారు.
దాదాపు అన్ని రంగాల షేర్లూ ర్యాలీలో పాలుపంచుకోవడం, ముఖ్యంగా ఐటీ, కొన్ని బ్యాంకింగ్ దిగ్గజాలు వేగంగా పెరగడం మరింత అప్ట్రెండ్కు సంకేతమని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా చెప్పారు. ర్యాలీని మిస్ అయ్యామన్న ఇన్వెస్టర్ల భావన, అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో మార్కెట్లో మూమెంటం కొనసాగుతుందని యాక్సిస్ సెక్యూరిటీస్ టెక్నికల్ అనలిస్ట్ రాజేశ్ పాల్వియా అంచనా వేశారు. మార్కెట్ తగ్గుదల కొనుగోళ్లకు అవకాశమని ట్రేడర్లు, ఇన్వెసర్లకు ఎల్కేపీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్, డెరివేటివ్ అనలిస్ట్ కునాల్ షా సూచించారు.
ఆప్షన్ రైటింగ్ యాక్టివిటీ ప్రకారం ఈ వారం నిఫ్టీకి 21250-21,300 శ్రేణి తక్షణ మద్దతు అందించవచ్చని, 21,500-21,600 పాయింట్ల శ్రేణి వరకూ పెరగవచ్చని రాజేశ్ పాల్వియా విశ్లేషించారు. ఈ శ్రేణిని దాటితే 21,800 వరకూ ర్యాలీ జరిగే ఛాన్స్ ఉంటుందన్నారు. పటిష్ఠమైన మూమెంటం నిఫ్టీని 21,700-22,000 పాయింట్ల స్థాయికి నడిపిస్తుందని కునాల్ షా అంచనా వేశారు. స్వల్పకాలిక కరెక్షన్లను క్వాలిటీ షేర్ల కొనుగోలుకు ఉపయోగించుకోవాలని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ అనలిస్ట్ సుభాష్ గంగాధరన్ సూచిస్తూ సమీప భవిష్యత్లో మరింత పెరుగుదలను మార్కెట్ టెక్నికల్స్ వెల్లడిస్తున్నాయని వివరించారు.