న్యూఢిల్లీ, డిసెంబర్ 27: మీ ఆదాయ పన్ను (ఐటీ) రిఫండ్ బ్యాంక్ ఖాతాలో ఎప్పుడు జమ అవుతుందా? అని మీరు ఇప్పటికీ వేచి చూస్తున్నారా?.. అసలు ఈ ఏడాది ఇంత సమయం ఎందుకు పడుతున్నది? అని ఆశ్చర్యపోతున్నారా?.. నిజానికి హై-వాల్యూ రిఫండ్ క్లెయిముల పరిష్కారానికి అదనపు వ్యవస్థీకృత పరిశీలనలుంటాయి. పైగా సెక్షన్ 143(1) ప్రకారం ఐటీ శాఖకు 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను దాఖలైన ఐటీఆర్‌ల ప్రక్రియ కోసం వచ్చే ఏడాది డిసెంబర్ 31దాకా సమయం ఉన్నది.
అలాగే ఐటీ చట్టం 1961లోని సెక్షన్ 245(2) కింద కొన్ని పరిస్థితుల్లో రిఫండ్స్ తిరిగి వెనుకకు వెళ్లిపోతాయి. అయితే దీనికి వ్యవస్థీకృత కారణాలేమీ పెద్దగా ఉండవు. ట్యాక్స్‌పేయర్స్ ద్వారా జరిగిన తప్పిదాలే ఎక్కువగా కారణమవుతూ ఉంటాయి. కాగా, మీ బ్యాంక్ ఖాతా అప్డేట్ అవ్వకపోయినా రిఫండ్స్ ఆలస్యం కావచ్చు. కాబట్టి ఈ-ఫైలింగ్ పోర్టల్‌పై మీ ప్రొఫైల్‌లో సరైన బ్యాంక్ ఖాతా వివరాలనే ఉంచాలి. ఇక ఈ-ఫైలింగ్ వెబ్సైట్ పేజీ https://www.incometax.gov.in/iec/foportal/ని సందర్శించి కూడా రిఫండ్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు.
మీ ఐటీఆర్ పరిశీలన 30 రోజుల్లోగా పూర్తికాకపోతే దాన్ని ఇన్వాలిడ్గా పరిగణిస్తారన్న విషయం మీకు తెలుసా? ప్రస్తుత సీబీడీటీ నిబంధనల ప్రకారం ఆన్లైన్లో ఐటీ రిటర్న్స్ దాఖలైతే 30 రోజుల్లోగా వెరిఫై కావాల్సిందే. ఇది ఇ-వెరిఫికేషన్ ద్వారానైనా లేదా బెంగళూరు సీపీసీకి సంతకమైన వెరిఫై ఐటీఆర్ భౌతిక కాపీని పంపడం ద్వారానైనా అవుతుంది. ఇక చాలామంది రిటర్న్స్‌ను దాఖలు చేసినా సకాలంలో దాన్ని వెరిఫై చేయడం మర్చిపోతారు. దాంతో డెడ్‌లైన్ ముగిసి అది పనికిరాకుండా పోతుంది.