గత ఏడాదిగా ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు సవాళ్లనే ఎదుర్కొంటున్నాయి. అమెరికా-ఇరాన్ సంఘర్షణతో పరిస్థితులు మరింత దిగజారాయి. అంతర్జాతీయ వృద్ధి ఆందోళనకరంగా మారడంతో మదుపరి సెంటిమెంట్ దెబ్బతింటున్నది. భారతీయ ఈక్విటీల్లోనూ ఇది కనిపిస్తున్నది. మార్కెట్ ఒడిదుడుకులు, మందగించిన రాబడుల వల్ల చాలామంది రిటైల్ మదుపర్లు అసంతృప్తికి లోనవుతున్నారు. ఇంకా చెప్పాలంటే తమ పెట్టుబడి వ్యూహాలపైనే పునరాలోచనలోపడ్డారు.
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో సిప్ ఉపసంహరణల ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. తాజా వివరాల ప్రకారం.. గడిచిన రెండేండ్లకుపైగా కాలంలో నిఫ్టీ 50లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ల (సిప్) ద్వారా పెట్టుబడి పెట్టిన మదుపర్లు 2.56 శాతం నష్టాలను చవిచూశారు. అలాగే నిఫ్టీ 500తో అనుసంధానమైన సిప్‌లలో పెట్టుబడుల ద్వారా వచ్చిన రాబడులు కేవలం 0.83 శాతమే. ఈ క్రమంలో సిప్‌లను మూసేస్తున్నవారి సంఖ్య పెరుగుతున్నది. అంతేగాక కొత్తగా వచ్చేవారి సంఖ్య కూడా తగ్గుతున్నది. మార్కెట్ అనిశ్చిత పరిస్థితుల నడుమ ఇది రిటైల్ ఇన్వెస్టర్లలో అప్రమత్తతను సూచిస్తున్నది. ఈ ఏడాది ఏప్రిల్‌లో మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ట్రెండ్‌ను గమనిస్తే.. కొత్త సిప్ రిజిస్ట్రేషన్ల కంటే ఉన్న సిప్ ఖాతాల ఉపసంహరణలే ఎక్కువగా కనిపించాయి.
ఏప్రిల్‌లో దాదాపు 2,95,000 కొత్త ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్‌లో చేరారు. 2023 జూన్ నుంచి గమనిస్తే ఒక నెలలో ఇంత తక్కువగా కొత్త మదుపర్లు రావడం ఇదే తొలిసారి. అంతకుముందు నెలలైన మార్చిలో 5 లక్షలు, ఫిబ్రవరిలో 7 లక్షల చేరికలున్నాయి. దీంతో నెలనెలా కొత్తవారి రాక తగ్గుముఖం పడుతున్నదని స్పష్టంగా తేలిపోతున్నది. వార్షికపరంగా చూసినా.. ఈ ఏడాది మార్చితో ముగిసిన 2025-26 సంవత్సరంలో 7.2 మిలియన్ల కొత్త ఇన్వెస్టర్లు రాగా, అంతకుముందు 2024-25లో 9.7 మిలియన్లుగా ఉండటం గమనార్హం. ఇక ఇందులో మొత్తం మదుపర్ల సంఖ్య 61.7 మిలియన్లు (6.17 కోట్లు)గా ఉన్నదని ఇండస్ట్రీ గణాంకాలు చెప్తున్నాయి.
సిప్‌లలో రోజు, వారం, నెలలవారీగా పెట్టుబడులకు అవకాశం ఉన్నది. పెద్ద మొ త్తాలకు బదులుగా చిన్నచిన్న మొత్తాల్లోనూ మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. క్రమశిక్షణ కలిగిన పెట్టుబడి పద్ధతులకు సిప్‌లు నిదర్శనంగా నిలుస్తాయి. ఇక గుడ్డిగా ఏదో ఒక ఫండ్‌ను ఎంచుకోకుండా, మీ లక్ష్యాలకు తగిన ఫండ్‌ను ఎంచుకొంటే ఆకర్షణీయ రాబడులను అందుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే స్వల్ప కాలంలో ఎదురయ్యే ఒడిదుడుకులను మరిచి దీర్ఘకాలిక పెట్టుబడులకు ప్రాధాన్యత ఇస్తే లాభాలు వస్తాయంటున్నారు. కనీసం 7 నుంచి 10 ఏండ్లపాటు పెట్టుబడులు పెడితే చక్కని ప్రతిఫలాలు అందుకునే వీలుందని సూచిస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ ఎక్స్‌పర్ట్స్‌ను సంప్రదించి ముందుకు వెళ్తే బాగుంటుందని సలహా ఇస్తున్నారు.