హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): ఫ్లాటెడ్ ఫ్యాక్టరీల ప్రతిపాదన ఏడాది దాటినా కాగితాలకే పరిమితమైంది. కనీసం వీటికి అవసరమైన ప్రణాళికలు కూడా ఇంకా సిద్ధం కాలేదు. ఓవైపు పరిశ్రమలకు భూముల కేటాయింపు, అనుమతులు నిలిపివేసిన రాష్ట్ర ప్రభుత్వం.. మరోవైపు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లకు ఉద్దేశించిన ఫ్లాటెడ్ ఫ్యాక్టరీల నిర్మాణంపైనా తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. ఎంఎస్ఎంఈల కోసం జిల్లాకొకటి చొప్పున ఫ్లాటెడ్ ఫ్యాక్టరీలు నిర్మిస్తామని గత ఏడాది బడ్జెట్ సందర్భంగా రేవంత్ సర్కారు ప్రకటించింది. అవసరమైతే ప్రైవేటు భాగస్వామ్యంతో వీటిని ఏర్పాటు చేస్తామని తెలిపింది.
చిన్నతరహా యూనిట్లు ఏర్పాటు చేసుకునేవారు పరిశ్రమకు అవసరమయ్యే భూమి కోసమే అధికంగా పెట్టుబడి పెట్టాల్సి వస్తున్నందున ప్రభుత్వమే భారీ బహుళ అంతస్తుల కాంప్లెక్స్‌లు నిర్మించి వాటికి కేటాయిస్తుందని చెప్పారు. అయితే ఏడాది దాటినా వీటికి సంబంధించిన ప్రణాళికల్ని ఇంకా పరిశ్రమల శాఖ సిద్ధం చేయట్లేదు. అటు ప్రభుత్వం కూడా కేవలం బడ్జెట్ సందర్భంగా ప్రకటించి మర్చిపోయిందే తప్ప.. ఆ తర్వాత దాని ప్రస్తావనను కూడా తీసుకురావడం లేదు. దీనిపై పరిశ్రమలు, టీజీఐఐసీ అధికారులను వివరణ కోరగా, ప్రభుత్వం నుంచి తమకు అటువంటి ఆదేశాలు ఏవీ రాలేదని, వస్తే ప్రతిపాదనలు రూపొందిస్తామని చెప్తుండటం గమనార్హం.
చిన్నతరహా యూనిట్లు స్థాపించాలనుకునేవారి కోసం ప్రభుత్వం కొత్తగా యువ వికాసం పేరుతో ఓ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దాదాపు రూ.5 లక్షలదాకా బ్యాంకు రుణంతో యూనిట్లు ఏర్పాటుచేసుకునేవారికి 60శాతం వరకు సబ్సిడీ ఇచ్చేందుకు ఉద్దేశించిన ఈ పథకాన్ని.. పరిశ్రమల శాఖ పథకాలకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం అమలు చేస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. వాస్తవానికి టీ-ఐడియా, టీ-ప్రైడ్ వంటి పథకాల ద్వారా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కో యూనిట్‌పై గరిష్టంగా కోటి రూపాయలదాకా సబ్సిడీలు అందించింది. ఈ క్రమంలో ఆ పథకాలను యువ వికాసంతో మరిపించాలని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నానా తంటాలు పడుతున్నది. మరి ఇది ఎంతవరకు సఫలీకృతమవుతుందో చూడాల్సిందే.
ఒక బహుళ అంతస్తుల భవన సముదాయంలో వేర్వేరుగా వివిధ తయారీ యూనిట్లు ఏర్పాటు చేసుకోవడమే ఫ్లాటెడ్ ఫ్యాక్టరీలు. ఉత్పత్తి, అసెంబ్లింగ్, స్టోరేజ్ తదితర కార్యకలాపాలు ఇందులో చేసుకోవచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎంఎస్ఎంఈల కోసం రెడీ టూ యూజ్ పద్ధతి. మనకు కావాల్సిన విస్తీర్ణంలో స్పేస్‌ను ప్రభుత్వం వద్ద లీజుకు తీసుకునే వీలుంటుంది. దీనివల్ల ఒకేసారి భూమి కొనుగోలు, భవన నిర్మాణం, విద్యుత్తుసహా ఇతర మౌలిక సదుపాయాల కోసం భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు.