Gold Loan | న్యూఢిల్లీ, మే 30: బంగారు రుణాలపై రిజర్వుబ్యాంక్ ప్రతిపాదించిన కొత్త మార్గదర్శకాలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ పలు సూచనలు చేసింది. బంగారం తాకట్టుపై రూ.2 లక్షల లోపు తీసుకునే రుణ గ్రహీతలకు ఈ మార్గదర్శకాల నుంచి మినహాయింపు నివ్వాలని సూచించింది. సెంట్రల్ బ్యాంక్ రూపొందించిన ఈ మార్గదర్శకాలపై దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు అభ్యంతరాలు వ్యక్తంచేయడంతో చివరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా తమిళనాడుకు చెందిన అన్ని రాజకీయ పార్టీలు ఈ ముసాయిదా మార్గదర్శకాలు చిన్నస్థాయి రుణ గ్రహీతలకు రుణాలు తీసుకోవడం కష్టతరంకానున్నదని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ సూచన చేసింది.
గత నెలలో ఆర్బీఐ పసిడి రుణాలపై ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో పసిడి తనఖా పెట్టుకొని ఇచ్చే రుణ విలువ, ఈ పసిడి విలువలో 75 శాతం కంటే మించరాదని పేర్కొంది. దీనివల్ల చిన్న, సన్నకారు రైతులకు రుణాలు లభించడం కష్టతరంకానున్నదని తమిళనాడు రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో సెంట్రల్ బ్యాంక్ జారీ చేసిన ముసాయిదాను ఆర్థిక సేవల విభాగం పరిశీలించింది. చిన్న బంగారు రుణ గ్రహీతల అవసరాలపై ప్రభావం పడకుండా ఉండే కొత్త మార్గదర్శకాలను జారీ చేయాలని ఆర్బీఐకి సూచించింది.
ఈ నూతన నిబంధనలు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. గత నెలలో జారీ చేసిన ముసాయిదా మార్గదర్శకాలపై భారీగా అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో సెంట్రల్ బ్యాంక్ ప్రత్యేక దృష్టి సారించింది. పలువురు రాజకీయ పార్టీలు, ఆర్థిక విశ్లేషకుల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన ఆర్బీఐ..తుది మార్గదర్శకాలను మార్చివేయాలనుకుంటున్నది.