న్యూఢిల్లీ, ఆగస్టు 14: దేశంలో ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసానికి సూచికగా ఉండే వాణిజ్య లోటు గత నెలలో ఏకంగా 8 నెలల గరిష్ఠాన్ని తాకింది. గురువారం విడుదలైన కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారిక గణాంకాల ప్రకారం జూలైలో భారత వాణిజ్య లోటు 27.35 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గత ఏడాది నవంబర్ తర్వాత ఇదే అత్యధికం కావడం గమనార్హం. నాడు 31.77 బిలియన్ డాలర్లుగా వాణిజ్య లోటు ఉన్నది. జూలైలో దేశంలోకి ఆయా దేశాల నుంచి వచ్చిన దిగుమతుల్లో.. మన దేశం నుంచి వివిధ దేశాలకు వెళ్లిన ఎగుమతులు దాదాపు సగానికే పరిమితమయ్యాయి మరి.
దేశీయ ఎగుమతులు గత నెలలో 37.24 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దీంతో గతంతో పోల్చితే 7.29 శాతం వృద్ధి కనిపిస్తున్నది. నిజానికి అంతకుముందు రెండు నెలలూ ఎగుమతులు పడిపోయాయి. అయితే జూలైలో పుంజుకున్నాయి. మరోవైపు దేశంలోకి దిగుమతుల విలువ 64.59 బిలియన్ డాలర్లుగా ఉన్నది. మునుపటితో చూస్తే 8.6 శాతం పెరిగింది. అందుకే వాణిజ్య లోటు ఇంతలా ఎగిసిందని మార్కెట్ నిపుణులు ప్రస్తుత పరిస్థితిని విశ్లేషిస్తున్నారు. కాగా, దేశంలో అన్ని రకాల వస్తూత్పత్తుల తయారీ పెరిగితే.. దిగుమతుల్ని తగ్గించుకోవచ్చని, తద్వారా విదేశీ మారకపు నిల్వలను కాపాడుకోవచ్చని అంటున్నారు. అలాగే ప్రస్తుతం అమెరికా టారిఫ్ల దృష్ట్యా ఆయా దేశాలకు ఎగుమతుల్ని పెంచుకోవడానికున్న అవకాశాలను అన్వేషించాలని కూడా కేంద్ర ప్రభుత్వానికి వారు సూచిస్తున్నారు. ఫలితంగా వాణిజ్య లోటును కట్టడి చేయవచ్చని, డాలర్ల రాకనూ పెంచుకోవచ్చని సలహా ఇస్తున్నారు.
ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) తొలి 4 నెలల్లో (ఏప్రిల్-జూలై) దేశ ఎగుమతులు 3.07 శాతం పెరిగి 149.2 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అయితే ఇదే సమయంలో దిగుమతులు 5.36 శాతం ఎగిసి 244.01 బిలియన్ డాలర్లుగా నమోదు కావడం గమనార్హం. దీంతో వాణిజ్య లోటు 94.81 బిలియన్ డాలర్లుగా ఉన్నది. కాగా, దేశ ఎగుమతుల ప్రోత్సాహానికి తీసుకోవాల్సిన చర్యలను త్వరలోనే ప్రకటిస్తామని ఈ సందర్భంగా కేంద్ర వాణిజ్య కార్యదర్శి సునీల్ భరత్వాల్ అన్నారు.
ఈ జూలైలో అమెరికాకు భారత్ నుంచి వెళ్లిన ఎగుమతుల్లో 19.94 శాతం వృద్ధి కనిపిస్తున్నది. గత నెల అగ్రరాజ్యానికి 8.01 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. అలాగే అమెరికా నుంచి మన దేశానికి దిగుమతులు 13.78 శాతం పెరిగి 4.55 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూలైలో అమెరికాకు భారత ఎగుమతులు 21.64 శాతం పెరిగి 33.53 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అమెరికా నుంచి దిగుమతులు 12.33 శాతం ఎక్కువై 17.41 బిలియన్ డాలర్లకు చేరాయి. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం మొదలు (ఏప్రిల్ నుంచి) అమెరికాకు భారత ఎగుమతులు నెలనెలా పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ నెల (ఆగస్టు) నుంచి పడిపోవచ్చన్న అంచనాలున్నాయి. అమెరికాలోకి దిగుమతయ్యే భారతీయ వస్తూత్పత్తులపై ట్రంప్ విధించిన సుంకాలే ఇందుకు కారణం. సెప్టెంబర్లో ఇవి మరింతగా క్షీణించే అవకాశాలూ కనిపిస్తున్నాయి. 50 శాతం టారిఫ్ల ప్రభావం ఉండనున్నది. దీంతో ఈ నెలాఖర్లో ఇరు దేశాల మధ్య జరిగే ఆరో విడుత వాణిజ్య చర్చలకు ప్రాధాన్యం ఏర్పడుతున్నది. చర్చలు ఫలిస్తే సుంకాల భారం తగ్గే అవకాశాలున్నాయి.