EPFO | న్యూఢిల్లీ, జనవరి 3: అధిక పెన్షన్‌ను ఎంచుకునే ఉద్యోగుల వేతన వివరాల్ని యాజమాన్యాలు అప్లోడ్ చేయడానికి ఈపీఎఫ్‌వో మే 31వరకూ గడువు పొడిగించింది. గతంలో ఇచ్చిన ఈ గడువు డిసెంబర్ 31తో ముగియడంతో మరోసారి పెంచినట్టు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. అధిక పెన్షన్‌కు అర్హులైన ఈపీఎఫ్‌వో పెన్షనర్లు/సభ్యులు దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్ సదుపాయాన్ని 2023 ఫిబ్రవరి 26న సంస్థ ప్రారంభించింది. ఉద్యోగుల దరఖాస్తులకు పలుదఫాలు పెంచిన గడువు జూలై 11తో ముగిసింది. ఈ సమయానికి 17.49 లక్షల దరఖాస్తులు ఈపీఎఫ్‌వోకు అందాయి.
అధిక పెన్షన్ కోసం ఆప్షన్/ఉమ్మడి ఆప్షన్ వ్యాలిడేట్ చేయడానికి దరఖాస్తులు సమర్పించే చివరితేదీని 2023 జూలై 11 వరకూ పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. దరఖాస్తుదారుల వేతన వివరాల్ని అప్లోడ్ చేయడానికి యాజమాన్యాలు, యాజమాన్యాల అసోసియేషన్లు గడువు పెంచాలన్న వినతి మేరకు తొలుత సెప్టెంబర్ 30, అటుతర్వాత డిసెంబర్ 31 వరకూ పొడిగించింది. ఇంకా యాజమాన్యాల వద్ద 3.6 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటిని యాజమాన్యాలు ప్రాసెస్ చేసేందుకు ఈపీఎఫ్‌వో ట్రస్టీల బోర్డు చైర్మన్ గడువు పెంచినట్టు మంత్రిత్వ శాఖ వివరించింది.