న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ఆదాయ పన్ను రిటర్ను (ఐటీఆర్)ల దాఖలుకున్న గడువు వచ్చే వారం ముగియనున్న క్రమంలో దాన్ని పొడిగించాలన్న డిమాండ్లు అంతటా పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను ఐటీఆర్ దాఖలుకున్న గడువు ఈ నెల (సెప్టెంబర్) 15తో ముగుస్తున్నది. అయితే సాంకేతిక, డాటా సరిపోలని సమస్యలు రిటర్న్స్ దాఖలుదారులను వేధిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే గడువును పొడిగించాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)ను వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులతోపాటు వాణిజ్య, ప్రొఫెషనల్ సంఘాలు కోరుతున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికీ తీసుకెళ్తున్నారు. చివరకు ఐటీ శాఖ పనితీరు, ఏర్పాట్లపై సొంత పార్టీ నేతల నుంచీ మోదీ సర్కారుకు సెగ తగులుతుండటం గమనార్హం.
కాగా, ఈ నెల 7 నాటికి కేవలం 4.89 కోట్ల ఐటీఆర్లే దాఖలైనట్టు ఆదాయ పన్ను శాఖ పోర్టల్ గణాంకాలు చెప్తున్నాయి. నిజానికి 13.35 కోట్ల మంది వ్యక్తిగత రిజిస్టర్డ్ యూజర్లున్నారు. ఇక వెరిఫై జరిగిన రిటర్నులు 4.63 కోట్లుగానే ఉన్నాయి. వీటిలో 3.35 కోట్ల రిటర్నుల ప్రాసెస్ మాత్రమే జరిగినట్టు అధికారిక లెక్కల్ని చూస్తే అర్థమవుతున్నది. ఇప్పటికే బాంబే చార్టర్డ్ అకౌంటెంట్స్ సొసైటీ.. ఈ సమస్యలపై సీబీడీటీకి లేఖ రాసింది. ఐటీఆర్ దాఖలుకున్న గడువును పొడిగించాలని డిమాండ్ చేసింది.
యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ (ఏఐఎస్), ట్యాక్స్‌పేయర్ ఇన్ఫర్మేషన్ సమ్మరీ (టీఐఎస్), ఫామ్ 26ఏఎస్‌లో డాటా మిస్మ్యాచ్లుంటున్నాయని చార్టర్డ్ అకౌంటెంట్లు, ట్యాక్స్ అడ్వకేట్స్, కన్సల్టెంట్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.