WNS Delivery Center | న్యూఢిల్లీ, మార్చి 14: గ్లోబల్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ (బీపీఎం) కంపెనీ డబ్ల్యూఎన్ఎస్.. గురువారం హైదరాబాద్‌లో ఓ కొత్త డెలివరీ సెంటర్‌ను తెరిచింది. నానక్‌రామ్‌గూడలోని ప్రెస్టీజ్ స్కై టెక్ వద్ద 40వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో దీన్ని ప్రారంభించింది. దాదాపు 1,400 మంది ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తారు. డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ డెలివరీ నెట్‌వర్క్‌లో భాగంగా ఏర్పాటైన ఈ ఫెసిలిటీ.. దాదాపు అన్ని రంగాలకు సేవలను అందించనున్నది. షిప్పింగ్, లాజిస్టిక్స్, హెల్త్‌కేర్, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా, హైటెక్, ప్రొఫెషనల్ సర్వీసెస్ తదితర రంగాలకు చెందిన సంస్థలకు డిజిటల్ సొల్యూషన్స్‌ను ఇవ్వనున్నది. ‘నైపుణ్యం, ప్రతిభ కలిగిన యువశక్తి, ప్రభుత్వ మద్దతులతో హైదరాబాద్ విశిష్ఠ సామర్థ్యాలను సంతరించుకున్నది. ఐటీ-బీపీఎం రంగంలో ఇక్కడ గొప్ప అవకాశాలున్నాయి’ అని డబ్ల్యూఎన్ఎస్ గ్రూప్ సీఈవో కేశవ్ ఆర్ మురుగేశ్ ఈ సందర్భంగా అన్నారు.
కాగా, ఇప్పటికే ఈ సంస్థకు బెంగళూరు, చెన్నై, గురుగ్రామ్, ఇండోర్, ముంబై, నాసిక్, నోయిడా, పుణె, విశాఖపట్టణాల్లో డెలివరీ సెంటర్లున్నాయి. గ్లోబల్ మార్కెట్ విషయానికొస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీకి 66 డెలివరీ సెంటర్లున్నాయి. వీటిలో 60,652 మంది పనిచేస్తున్నారు. భారత్‌సహా కెనడా, చైనా, కోస్టారికా, మలేషియా, ఫిలిప్పీన్స్, పోలాండ్, రొమేనియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, టర్కీ, బ్రిటన్, అమెరికా దేశాల్లో డబ్ల్యూఎన్ఎస్కు డెలివరీ సెంటర్లున్నాయి. భారత్‌లో ముంబై ప్రధాన కేంద్రంగా ఈ సంస్థ పనిచేస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో సంస్థ లాభం గతంతో పోల్చితే 14 శాతం పెరిగింది. 39.6 మిలియన్ డాలర్లుగా నమోదైంది. రెవిన్యూ 326.2 మిలియన్ డాలర్లుగా ఉన్నది.