న్యూఢిల్లీ, మే 27: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆకట్టుకోవడంలో కేంద్రం పూర్తిగా విఫలమవుతున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏడాది ప్రాతిపదికన 24.5 శాతం తగ్గి 9.34 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. 2023-24 ఏడాది ఇదే త్రైమాసికంలో భారత్లోకి 12.38 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి.
అంతర్జాతీయ దేశాల ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు నెలకొనడంతో దేశీయంగా పెట్టుబడులు పెట్టడానికి విదేశీ ఇన్వెస్టర్లు వెనుకంజవేస్తున్నారు. కానీ, 2024-25 ఆర్థిక సంవత్సం మొత్తానికి ఎఫ్డీఐలు 13 శాతం పెరిగి 50 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.
సింగపూర్ నుంచి అత్యధికంగా 14.94 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు రాగా, మారిషస్ నుంచి 3.73 బిలియన్ డాలర్లు, అమెరికా నుంచి 5.45 బిలియన్ డాలర్లు, నెదర్లాండ్స్ నుంచి 4.62 బిలియన్ డాలర్లు, యూఏఈ నుంచి 3.12 బిలియన్ డాలర్లు, జపాన్ నుంచి 2.47 బిలియన్ డాలర్లు, బ్రిటన్ నుంచి 795 మిలియన్ డాలర్లు, జర్మనీ నుంచి 469 మిలియన్ డాలర్ల మేర ఎఫ్డీఐలు వచ్చాయి. మొత్తం ఎఫ్డీఐల్లో సింగపూర్ వాటా 30 శాతంగా ఉండగా, మారిషస్ వాటా 17 శాతం, అమెరికా వాటా 11 శాతంగా ఉన్నది. ట్రేడింగ్, టెలికాం, ఆటో, నాన్-కన్వెన్షనల్ ఎనర్జీ, కెమికల్స్ రంగాల్లోకి పెట్టుబడులు వచ్చాయి.