న్యూఢిల్లీ, డిసెంబర్ 13: బ్యాంకుల్లో ఎవ రూ క్లెయిమ్ చేసుకోని సుమారు రూ.190 కోట్ల డిపాజిట్లను వాటి అసలు డిపాజిట్‌దారులకు అప్పగించడానికి కేంద్ర ప్రభుత్వం ‘యువర్ క్యాపిటల్, యువర్ రైట్’ పేరిట ఓ దేశవ్యాప్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దాదాపు 5 లక్షల పౌరులకు చెందినవిగా ఈ డిపాజిట్లను అధికారులు తేల్చారు. కాగా, UDGAM పోర్టల్ ద్వారా డిపాజిట్‌దారులు అన్ని బ్యాంకుల్లో మరిచిపోయిన తమ డిపాజిట్లను గుర్తించవచ్చు. తద్వారా సులభంగా వారి సొమ్మును రీక్లెయిమ్ చేసుకోవచ్చు. నిజానికి ఏండ్ల తరబడి ఈ నిధులు బ్యాంకుల్లోనే ఉండిపోతున్నాయి.
ముఖ్యంగా డిపాజిట్‌దారుల మరణంతో కుటుంబ సభ్యులకు ఆ సమాచారం లేకపోవడమూ అన్క్లెయిమ్డ్ డిపాజిట్ నిల్వలను పెంచుతూపోతున్నాయి. అందుకే వీటిని తిరిగి వారి వారసులకు అప్పగించే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం చర్యలు తీసుకుంటున్నది. యూజర్లు పేరు, మొబైల్ నెంబర్, పాన్ లేదా పుట్టినతేదీ వివరాలను సమర్పించి డిపాజిట్ల వివరాలను బ్యాంకుల్లో తెలుసుకోవచ్చు. అప్పుడు ఏదైనా డిపాజిట్‌ను గుర్తిస్తే అది ఎంత మొత్తం? ఏ బ్యాంక్‌లో ఉన్నది? అన్న వివరాలు ఉద్గమ్ పోర్టల్ ద్వారా అందుతాయి. సరైన పత్రాలు చూపించి నగదు తీసుకోవచ్చు.