సొమ్ము చేసుకోవడానికి ఏది అనువుగా ఉంటే దానిపై దృష్టి పెడుతున్న మోదీ సర్కారు.. ఇప్పుడు బొగ్గు గనులపై కన్నేసింది.
ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను అమ్ముకుంటూ వేల కోట్లను పోగేస్తున్న కేంద్రం.. ఇక కోల్ మైనింగ్లోని ఆస్తుల నగదీకరణకు దిగాలని చూస్తున్నది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బొగ్గు గనుల రంగానికి చెందిన రూ.75వేల కోట్లకుపైగా ఆస్తులను విక్రయించాలని ప్రణాళికల్ని రచిస్తున్నట్టు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ చెప్తున్నది.
న్యూఢిల్లీ, జూన్ 7: ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో బొగ్గు గనుల రంగంలోని రూ.75,220 కోట్ల విలువైన ఆస్తుల నగదీకరణకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. బొగ్గు గనుల ద్వారా రూ.52,200 కోట్లు, మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ (ఎండీవో) మోడల్పైనున్న ప్రాజెక్టుల నుంచి రూ.20,320 కోట్లు, ఆగిపోయిన గనుల నుంచి రూ.2,000 కోట్లు, వాషరీస్ నుంచి రూ.700 కోట్లు చొప్పున ఆదాయాన్ని అందుకోవచ్చని 2022-23కిగాను విడుదల చేసిన తమ నగదీకరణ ప్లాన్లో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ పేర్కొన్నది. ఈ క్రమంలో వీలైనంత త్వరగా వీటి నుంచి నిధుల సమీకరణ చేపట్టాలని మోదీ సర్కారు భావిస్తున్నది.
రూ.6,060 కోట్లే అయినా..
నిజానికి ఈ ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖకు నీతి ఆయోగ్ పెట్టిన ఆస్తుల నగదీకరణ లక్ష్యం రూ.6,060 కోట్లుగానే ఉన్నది. ఈ మేరకు సదరు మంత్రిత్వ శాఖనే చెప్తున్నది. అయినప్పటికీ అంతకు దాదాపు 13 రెట్లు ఎక్కువగా ఆస్తులను అమ్మేయాలని కేంద్రం చూస్తుండటం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలోనూ రూ.3,394 కోట్ల లక్ష్యానికి ఏకంగా రూ.40,090 కోట్ల విలువైన ఆస్తులను బొగ్గు మంత్రి త్వ శాఖ అమ్మేసింది. బొగ్గు గనుల ద్వారా రూ.28, 986 కోట్లు, ఎండీవో మోడల్ నుంచి రూ.9,592.64 కోట్లు, కోల్ బెడ్ మీథేన్ ప్రాజెక్టుల నుంచి రూ.1,512 కోట్లు సమీకరించారు.
అమ్మకానికి 39 గనులు
ఈసారి 39 బొగ్గు గనులను అమ్మాలని చూస్తున్నారు. నీతి అయోగ్ అంచనాల ప్రకారం వీటి విలువ రూ. 28,986 కోట్లు. కాగా, 2021-22 నుంచి 2024-25 మధ్య నగదీకరణ కోసం 160 బొగ్గు గనులను గుర్తించినట్టు నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ గణాంకాల ద్వారా తెలుస్తున్నది. ఇందులో 17 ప్రాజెక్టులు ఎండీవో మోడల్లో ఉన్నాయి. 3 వాషరీలు, ఓ బొగ్గు గ్యాసిఫికేషన్ ప్లాంట్, 35 గుర్తించబడిన రకరకాల ప్రాజెక్టులు, 4 ఆగిపోయిన ప్రాజెక్టులు, వాణిజ్య వేలపు గనులున్నాయి. విలువ రూ.28,747 కోట్లుగా అంచనా. ఇక 761 మినరల్ బ్లాక్లూ 2024-25 వరకు అమ్మకానికి రావచ్చని తెలుస్తున్నది.