Telangana | తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కుట్ర.. చైనాను బూచిగా చూపిస్తూ డ్రామా!
Telangana | చైనాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం బీవైడీని రాష్ర్టానికి రాకుండా అడ్డుకోవడం కోసమే కేంద్ర ప్రభుత్వం భద్రతాపరమైన కారణాలను బూచిగా చూపినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Telangana | చైనాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం బీవైడీని రాష్ర్టానికి రాకుండా అడ్డుకోవడం కోసమే కేంద్ర ప్రభుత్వం భద్రతాపరమైన కారణాలను బూచిగా చూపినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అనేక చైనా కంపెనీలు భారత్‌లో కార్యకలాపాలు కొనసాగిస్తుండటమే కాకుండా, మోదీ అధికారంలోకి వచ్చిన తొలి మూడేండ్లలోనే దేశంలో చైనా పెట్టుబడులు ఐదింతలు పెరగడాన్నిబట్టి ఈ వాదనకు బలం చేకూరుతున్నది.
హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): దేశంలో దాదాపు మూడున్నర వేలకుపైగా కంపెనీల్లో చైనాకు చెందిన సంస్థలకు వాటాలున్నాయి. వాటిలో ఆ దేశానికి చెందినవారు డైరెక్టర్లుగా కూడా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో మన రాష్ర్టానికి చెందిన మేఘా కంపెనీతో కలిసి కార్ల తయారీ పరిశ్రమ స్థాపనకు ముందుకొచ్చిన బీవైడీని అడ్డుకోవడం పూర్తిగా కుట్రపూరితమనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
ఆటోమొబైల్‌కు అడ్డా
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో సులభతర, స్నేహపూర్వక పారిశ్రామిక విధానాలను, మెరుగైన ప్రోత్సాహకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కారణంగానే దేశ, విదేశాలకు చెందిన పెట్టుబడులు రాష్ర్టానికి వెల్లువెత్తుతున్నాయి. ఇందులో ఆటోమొబైల్ రంగం ఒకటి. ఇప్పటికే మహీంద్రా అండ్ మహీంద్రా పటాన్‌చెరూలో ట్రాక్టర్లను ఉత్పత్తి చేస్తుండగా, పలు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కంపెనీలు సైతం ఇక్కడ కొలువుదీరాయి. అంతేకాకుండా దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ టెస్టింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేస్తున్నది. అలాగే మన రాష్ర్టానికి చెందిన మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఇప్పటికే బీవైడీ సాంకేతిక సహకారంతో ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ పేరుతో ఎలక్ట్రిక్ బస్సులను ఉత్పత్తి చేస్తున్నది. ఈ కంపెనీకి ప్రస్తుతం వివిధ రాష్ర్టాల నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్లు కూడా ఉన్నాయి.

ఉద్యోగావకాశాలకు చెక్
మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(మెయిల్), చైనా ఎలక్ట్రిక్ వెహికిల్ తయారీ దిగ్గజం బీవైడీ (బిల్డ్ ఇవర్ డ్రీమ్స్) మోటర్స్ సంయుక్తంగా రాష్ట్రంలో రూ.8,200 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్ కార్ల తయారీ ప్లాంటును స్థాపించాలని నిర్ణయించాయి. దీనికోసం రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్‌లో సుమారు 500 ఎకరాల స్థలాన్ని కేటాయించేందుకు టీఎస్ఐఐసీ ఇదివరకే సంసిద్ధత వ్యక్తం చేసింది. ఏటా 15,000 ఎలక్ట్రిక్ కార్ల తయారీ సామర్థ్యంతో ఏర్పాటు చేయాలనుకున్న ఈ ప్లాంటుతో పెద్ద సంఖ్యలో ఉద్యోగావకాశాలూ లభించేవే. ఆర్థికంగా మేఘా, సాంకేతికంగా బీవైడీ సంయుక్తంగా యూనిట్‌ను నెలకొల్పాలన్నది ప్రతిపాదన. అయితే భద్రతాపరమైన కారణాలతో ఈ పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం అనుమతులు తిరస్కరించింది. నిజానికి ఇప్పటికే మేఘా, బీవైడీ కలిసి ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేస్తున్నా.. తాజాగా కార్ల తయారీ పరిశ్రమకు అనుమతులు తిరస్కరించడం పలు సందేహాలకు తావిస్తున్నది. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ కుట్రపూరిత చర్యేనని అంతా విమర్శిస్తున్నారు.
మార్కెట్ నిండా చైనా వస్తువులే
సమగ్ర డేటాబేస్ అందుబాటులో లేనందున ఎన్ని కంపెనీల్లో చైనాకు చెందినవారు పెట్టుబడులు పెట్టారనేది కచ్చితంగా చెప్పలేమని, తమవద్ద ఉన్న సమాచారం మేరకు ఈ వివరాలను వెల్లడిస్తున్నట్టు కార్పొరేట్ ఎఫైర్స్ సహాయ మంత్రి రావు ఇంద్రజీత్ సింగ్ పార్లమెంటుకు తెలిపారు. ఈమధ్య కాలంలో చైనాతో తలెత్తిన ఉద్రిక్తతల వల్ల కొన్ని టిక్‌టాక్ వంటి యాప్‌లను కేంద్రం నిషేధించగా, చైనా వస్తువులను బహిష్కరించాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయినప్పటికీ భారతీయ మార్కెట్లో చైనా వస్తువుల విక్రయాలపై పెద్దగా ప్రభావం పడలేదని చెప్పవచ్చు.
ఈ-కామర్స్, ఫైనాన్స్, విద్య, మీడియా, సోషల్ మీడియా, ఎంటర్టైన్మెంట్, లాజిస్టిక్స్ తదితర స్టార్టప్ కంపెనీలతోపాటు ఆటో, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, క్యాపిటల్ గూడ్స్, ఎలక్ట్రానిక్స్, ఎఫ్ఎంసీజీ, నిర్మాణం, ఔషధాలు తదితర రంగాల్లో చైనా కంపెనీల ప్రత్యక్ష పెట్టుబడులు
- 2014లో నరేంద్ర మోదీ అధికారంలోకి రాగా, ఆ తర్వాతి మూడేండ్లలోనే దేశంలో ఐదు రెట్లు పెరిగిన చైనా పెట్టుబడులు
- అంతకుముందు దేశంలో చైనా పెట్టుబడులు 1.6 బిలియన్ డాలర్లు
- మోదీ వచ్చిన తొలి మూడేండ్లలోనే 8 బిలియన్లకు పెరుగుదల
- దేశంలోని సుమారు 3,560 కంపెనీల్లో చైనావారు కూడా డైరెక్టర్లే
- 174 కంపెనీలు విదేశీ కంపెనీలుగా నమోదు
- చైనాకు చెందిన అలీబాబాతోపాటు దాని అనుబంధ సంస్థలకు భారత కంపెనీల్లో భారీగా పెట్టుబడులు
తయారీ రంగంలో..
భారతీయ మార్కెట్.. ప్రపంచంలోని అతిపెద్ద మార్కెట్లలో ఒకటి. అందుకే ఇక్కడ తయారీ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ప్రపంచ కంపెనీలు ముందుకొస్తుంటాయి. ఇందులో చైనా అతి ప్రధానమైనదిగా చెప్పవచ్చు. మన దేశ మార్కెట్లో చైనా వస్తువులకు కొదవలేదు. షియోమీ, లెనోవా, ఒప్పో, వివో, రియల్మీ, వన్‌ప్లస్, టీసీఎల్, విస్కో, హైయర్, హువావీ తదితర కంపెనీలు చైనావే. ఇక బిగ్ బాస్కెట్, డైలీహంట్, టికెట్‌న్యూ, స్విగ్గీ, ఉడాన్, ప్రాక్టో, హైక్, గానా, బైజూస్, జొమాటో, ఓలా, ఓయో రూమ్స్, పేటీఎం, హైక్ మెసెంజర్, స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్ తదితర అనేక భారతీయ కంపెనీల్లో చైనా సంస్థలకు వాటాలున్నాయి.
ఆంక్షలతో కూడిన అనుమతులిచ్చినా మేలు..
‘అమ్మ పెట్టాపెట్టదు.. అడుక్కు తినానివ్వదు’ అన్నట్టుంది ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తీరు. తెలంగాణపట్ల తీవ్ర వివక్షను ప్రదర్శిస్తున్న కేంద్రం.. తాము ఇవ్వాల్సినవి ఇవ్వకపోవడమేగాక, వచ్చే పెట్టుబడులనూ అడ్డుకుంటున్నది. విభజన హామీలను సైతం ఇప్పటివరకు నెరవేర్చలేదు. కంటోన్మెంట్ ప్రాంతం గుండా ఎక్స్‌ప్రెస్‌వే కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ భూములు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నది. మెగా టెక్స్టైల్ పార్క్ ఇస్తున్నట్టు పదేపదే ప్రకటించి మొండిచేయి చూపింది. ఇలా.. అనేక అంశాల్లో కేంద్రం తెలంగాణకు ద్రోహం చేసిందని చెప్పవచ్చు. తాజాగా రాష్ర్టానికి వస్తున్న పెట్టుబడులను కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నదనడానికి బీవైడీకి అనుమతులు తిరస్కరించడమే నిదర్శనం. ఒకవేళ భద్రతాపరమైన చిక్కులుంటే ఆంక్షలతో కూడిన అనుమతుల్నైనా ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు గట్టిగా వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

