ముంబై, అక్టోబర్ 19: ఏడు రోజుల ర్యాలీకి మంగళవారం చిన్న బ్రేక్ పడింది. ట్రేడింగ్ తొలిదశలో బీఎస్ఈ సెన్సెక్స్ 62,000 పాయింట్ల శిఖరాన్ని అధిరోహించి 62,245 పాయింట్ల వద్ద కొత్త రికార్డును నెలకొల్పింది. అటుతర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు తెరతీయడంతో సూచీ నష్టాల్లోకి జారిపోయింది. చివరకు 50 పాయింట్ల తగ్గుదలతో 61,716 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 18,604 పాయింట్ల వద్ద రికార్డు గరిష్ఠాన్ని నమోదుచేసిన అనంతరం&తుదకు 58 పాయింట్ల నష్టంతో 18,419 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.
ఐటీసీ 6 శాతం పతనం
సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే ఎక్కువగా ఐటీసీ 6 శాతం క్షీణించింది. పొగాకు ఉత్పత్తులపై పన్నుల విధానాన్ని సమీక్షించేందుకు కేంద్రం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటుచేసిందన్న వార్తతో ఈ షేరు తగ్గింది. అలాగే మరో ఎఫ్ఎంసీజీ కంపెనీ హిందుస్థాన్ యూనీలీవర్ కార్పొరేట్ ఫలితాలు అంచనాల్ని అందుకోలేకపోవడంతో ఈ షేరు 4 శాతం పడిపోయింది. టైటాన్, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్గ్రిడ్లు నష్టపోయిన షేర్లలో ఉన్నాయి. మరోవైపు టెక్ మహీంద్రా, ఎల్ అండ్ టీ, బజాజ్ ఫిన్సర్వ్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కొటక్ బ్యాంక్లు 1-4 శాతం మధ్య లాభపడ్డాయి. బీఎస్ఈ రియల్టీ, ఎఫ్ఎంసీజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, మెటల్ సూచీలు 4.5 శాతం వరకు తగ్గాయి.