ముంబై, మార్చి 13: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో ఉరుముతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లు ఒకడుగు ముందుకు, నాలుగడుగులు వెనుకకు అన్నట్టున్నాయి. భౌగోళిక-రాజకీయ ఉద్రికత్తలు ఆందోళనల్ని రేకెత్తిస్తుంటే.. మదుపరులు స్టాక్స్ నుంచి పెట్టుబడుల ఉపసంహరణలకు దిగుతూ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. భారతీయ పరిస్థితులూ ఇందుకు మినహాయింపు కాదు. అయినప్పటికీ బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ ఈ ఏడాది ఆఖరుకల్లా లక్ష మార్కును దాటి 1,05,000 వద్దకు వెళ్తుందన్న ఓ తాజా అంచనా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతున్నది. అవును.. మోర్గాన్ స్టాన్లీ వేసిన ఈ అంచనా ట్రేడ్ వర్గాల్లో హల్చల్ చేస్తున్నదిప్పుడు.
ప్రస్తుతం సెన్సెక్స్ ఉన్న స్థాయితో చూసినైట్టెతే.. మోర్గాన్ స్టాన్లీ అంచనా 41 శాతం అధికం మరి. గురువారం 74వేల మార్కునూ కోల్పోయింది. ఈ క్రమంలో ఏకంగా లక్ష స్థాయిని దాటేస్తుందని మోర్గాన్ స్టాన్లీ చెప్పడం మిక్కిలి ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది. ట్రంప్ టారిఫ్ భయాలతో ఇటీవలికాలంలో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాలనే చవిచూస్తున్నాయి. అప్పుడప్పుడు పెరిగినా.. ఆ తర్వాత వచ్చే నష్టాలు ఆ ఆనందాన్ని దూరం చేస్తున్నాయి. అయితే పరిస్థితులన్నీ చక్కబడుతాయన్నట్టుగా మోర్గాన్ స్టాన్లీ చెప్తున్నది. దీంతో మదుపరుల్లో కొత్త ఆశలు చిగురించే వీలుందని స్టాక్ బ్రోకర్లు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
రియల్టీ, ఐటీ, వాహన రంగ షేర్లలో గురువారం భారీగా విక్రయాలు జరగడంతో వరుసగా ఐదోరోజూ సూచీలు నష్టపోయాయి. 200 పాయింట్లకుపైగా నష్టపోయిన సెన్సెక్స్ 74 వేల దిగువకు పడిపోయింది. చివరకు 73,828.91 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 73.30 పాయింట్లు కోల్పోయి 22, 397.20 వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలతో మదుపరులు లక్షల కోట్ల సంపదను కోల్పోతున్నారు.