Tesla Model Y | గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా.. చైనాలో తన ఫ్లాగ్ షిప్ కారు ‘మోడల్ వై ఈవీ’ ఉత్పత్తి తగ్గించాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రముఖ వార్తా సంస్థ ‘రాయిటర్స్’ కథనం ప్రకారం ఈ ఏడాది మార్చి నుంచి జూన్ మధ్య కనీసం 20 శాతం కార్ల ఉత్పత్తి తగ్గించాలని టెస్లా నిర్ణయించినట్లు తెలుస్తున్నది. గత నెల వరకూ చైనాలో అమ్ముడైన టెస్లా కార్లలో ‘మోడల్ వై ఈవీ’ వాటా దాదాపు 77 శాతం కావడం గమనార్హం. దీనికి చైనా ఈవీ కార్ల తయారీ సంస్థ ‘బీవైడీ’ నుంచి టెస్లాకు గట్టి పోటీ ఎదురవుతున్నట్లు తెలుస్తున్నది.
షాంఘైలోని గిగా ఫ్యాక్టరీలో మోడల్ వై, ఇతర ఎలక్ట్రిక్ కార్లను టెస్లా తయారు చేస్తోంది. అమెరికా తర్వాత చైనాలోనే అత్యధికంగా కార్లను ఉత్పత్తి చేస్తోంది టెస్లా. ‘మోడల్ వై’ తర్వాత మోడల్ 3 ఎలక్ట్రిక్ కార్లు కూడా చైనాలో విక్రయిస్తోంది. ఇటీవల కాలంలో చైనా ఎలక్ట్రిక్ కార్ల నుంచి గట్టి పోటీ ఎదురు కావడంతో టెస్లా తన కార్ల సేల్స్ పెంచుకోవడానికి ధరలు తగ్గించాల్సిన పరిస్థితి నెలకొంది. చైనాలో ‘మోడల్ వై’ కార్ల ఉత్పత్తి తగ్గింపు విషయమై టెస్లా అధికారికంగా వెల్లడించలేదు. కానీ, మార్చి- జూన్ మధ్య ‘మోడల్ వై’ కార్ల తయారీ తగ్గించిందని రాయిటర్స్ కు టెస్లా సన్నిహిత వర్గాలు తెలిపాయి.
చైనా అసోసియేషన్ ఆఫ్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సీఏఏఎం) వెల్లడించిన గణాంకాల ప్రకారం మార్చిలో మోడల్ వై ఈవీ కార్ల ఉత్పత్తి 49,498, ఏప్రిల్లో 36,610 కార్లకు తగ్గాయి. గత నెలాఖరు వరకూ చైనాలో 2.87 లక్షల ఈవీ కార్లను టెస్లా తయారు చేసింది. కానీ ఇది గతేడాదితో పోలిస్తే ఐదు శాతం తక్కువే. ఇదిలా ఉంటే, ఇదే కాలంలో ‘మోడల్ 3 ఈవీ’ కార్ల ఉత్పత్తి 10 శాతం పెరగడం గమనార్హం.
ఇటీవలి కాలంలో చైనాలో టెస్లా కార్ల విక్రయాలు తగ్గాయి. గత నాలుగు నెలల్లో ఎలక్ట్రిక్, ప్లగ్-ఇన్ హైబ్రీడ్ సెగ్మెంట్లలో కార్ల ఉత్పత్తి దాదాపు ఏడు శాతం తగ్గింది. 2021 నాటి ధర కంటే మోడల్ వై కారు ధర తగ్గించేసింది టెస్లా. సేల్స్ పెంచుకోవడానికి మోడల్3 కారుకు జీరో ఫైనాన్సింగ్ స్కీమ్ ఆఫర్ చేసింది. ఇక ఈ ఏడాది ఆరు లక్షలకు పైగా కార్లను విక్రయించాలని టెస్లా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా తన వార్షిక ఔట్ లుక్ సవరించే అవకాశాలు ఉన్నాయి.