న్యూఢిల్లీ, జూలై 11: అంతర్జాతీయ ఈవీ కార్ల దిగ్గజం టెస్లా..భారత్లో అడుగుపెట్టబోతున్నది. దేశంలో తన తొలి షోరూంను వచ్చేవారంలో ప్రారంభించబోతున్నట్టు తెలుస్తున్నది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ నెలకొల్పిన తన తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఈ నెల 15న ప్రారంభించబోతున్నది. ఎలాన్ మస్క్ నాయకత్వంలో నడుస్తున్న టెస్లా..ఈ షోరూం ప్రారంభోత్సవానికి ఎంపిక చేసిన వ్యక్తులకు మాత్రమే ఆహ్వానాలు పంపింది. ఈ షోరూం ప్రారంభోత్సవంపై కంపెనీ ప్రతినిధి స్పందించడానికి నిరాకరించారు.
ఇప్పటికే పలు ఎలక్ట్రిక్ కార్లను చైనా ప్లాంట్ నుంచి భారత్కు తరలించినట్టు ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. ఈవీ కార్ల పార్కింగ్ కోసం ముంబైలో 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వేర్హౌజింగ్ను లీజుకు తీసుకున్నది సంస్థ.