Tesla – Elon Musk | టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ పట్ల ఆ సంస్థలోని కొందరు వాటాదారుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతున్నది. టెస్లా సీఈఓగా 56 బిలియన్ డాలర్ల ఎలన్ మస్క్ వార్షిక వేతన ప్యాకేజీని టెస్లా వాటాదారుల గ్రూప్ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తున్నది. ఎలన్ మస్క్ వేతన ప్యాకేజీని ఆమోదించవద్దని ఇతర వాటాదారులను ఈ వాటాదారుల గ్రూప్ కోరుతున్నట్లు వార్తలొచ్చాయి. ఎలన్ మస్క్ వ్యవహార శైలి అన్యమనస్కంగా ఉంటున్నదని, టెస్లాకు మెరుగైన ప్రయోజనాలు కల్పించేందుకు పని చేయడం లేదని ఆ గ్రూప్ ఆరోపిస్తున్నది.
ఈవీ కార్ల తయారీ సంస్థ టెస్లాతోపాటు సోషల్ మీడియా కంపెనీ ‘ఎక్స్’, రాకెట్ మేకింగ్ ‘స్పేస్ఎక్స్, టన్నెల్ క్రియేటింగ్ స్టార్టప్ ‘బోరింగ్ కంపెనీ, న్యూరాలింక్ అనే న్యూరో టెక్నాలజీ కంపెనీ, ఏఐ కంపెనీ ‘ఎక్స్ఏఐ’ యాజమాన్య బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలన్ మస్క్ వ్యవహార శైలి వల్ల టెస్లా పేరు గట్టిగా వినిపిస్తున్నా.. ఇటీవలి కాలంలో కార్ల విక్రయాలు తగ్గిపోవడం పట్ల వారిలో అసంతృప్తి పెరుగుతున్నది. టెస్లాలో సుపరిపాలన దెబ్బ తిన్నదని, తక్షణం అటెన్షన్ ప్రదర్శించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ ఇతర వాటాదారులకు ఈ గ్రూప్ బహిరంగ లేఖ రాసింది. టెస్లాకు దీర్ఘకాలికంగా సుస్థిర విజయాలు సాధించేలా పని చేసే పూర్తికాలపు సీఈఓ అవసరం అని భావిస్తున్నది. టెస్లా డైరెక్టర్లుగా ఎలన్ మస్క్ సోదరుడు కింబాల్ మస్క్, జేమ్స్ మర్డోక్ లకు వ్యతిరేకంగా ఓటేయాలని కూడా ఇతర వాటాదారులను కోరుతున్నారు.