Elon Musk’s Tesla | భారత్ మార్కెట్లోకి విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లాకు, దాని సీఈవో ఎలన్‌మస్క్‌కు స్వాగతం పలుకుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. కానీ, భారత్ స్వావలంబన (ఆత్మ నిర్బర్ భారత్) విషయంలో ఎటువంటి రాజీ పడే ప్రసక్తే లేదని కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే శనివారం స్పష్టం చేశారు. టీవీ9 ఆధ్వర్యంలో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తొలుత కార్ల సేల్స్, సర్వీసింగ్ అనుమతి ఇస్తే తప్ప.. భారత్‌లో ఉత్పాదక యూనిట్ ఏర్పాటు చేయగలమని ఎలన్‌మస్క్ సెలవిచ్చారు. దీన్ని బట్టి ఇప్పట్లో భారత్‌లో టెస్లా మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు అనుమానమేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
అమెరికా విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈవో ఎలన్‌మస్క్.. భారత్‌లో తమ కార్ల విక్రయంపై దిగుమతి సుంకాలు తగ్గించాలని కోరుతున్నారు. తొలుత కార్ల విక్రయం, సర్వీసింగ్‌కు అనుమతి ఇస్తే తప్ప భారత్‌లో స్థానికంగా కార్ల ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేయలేమని గత నెలలో టెస్లా సీఈవో ఎలన్‌మస్క్ చెప్పారు. భారత్‌లో టెస్లా మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసే విషయమై సంస్థ ప్లాన్లపై నెటిజన్ కోరినప్పుడు మస్క్ స్పందించారు. కార్ల విక్రయం, సర్వీసింగ్‌కు తమను అనుమతించనందున భారత్‌లో ఏ ప్రాంతంలోనూ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయబోదన్నారు.
మస్క్ వ్యాఖ్యలపై కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే స్పందించారు. ప్రధాని నరేంద్రమోదీ సారధ్యంలోని ప్రభుత్వం ఆత్మ నిర్బర్ పాలసీ అమలుకు కట్టుబడి ఉంది. దీనిపై మంచి స్పందన లభిస్తున్నది. ఈ పాలసీ అమలుపై ఏ విధంగానూ రాజీ పడబోమన్నారు. భారత ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా టెస్లా, దాని సీఈవో ఎలన్‌మస్క్‌కు స్వాగతం పలుకుతామన్నారు. ప్రస్తుతం దిగుమతి చేసుకున్న కార్లపై 100 శాతం దిగుమతి సుంకాలు భారత్ వసూలు చేస్తున్నది. దీన్ని బట్టి ఇప్పట్లో భారత్ రోడ్లపై ఎలన్‌మస్క్ సారధ్యంలోని టెస్లా విద్యుత్ కార్లు పరుగులు తీయడం అనుమానమేనన్న అభిప్రాయం వినిపిస్తున్నది.