Tesla Car | ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా భారత్‌లోకి ప్రవేశించనున్నది. భారత్‌లో తక్కువ ధరకే వై మోడల్ వెర్షన్‌ను త్వరలో తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నది. కొత్త మోడల్ కారు తయారీ ఖర్చు దాదాపు 20శాతం తగ్గనున్నట్లు తెలుస్తున్నది. టెస్లా దీన్నీ సరసమైన ఎస్‌యూవీగా మార్చే అవకాశం ఉన్నది. అయితే, ఇది పూర్తిగా కొత్త మోడల్ కాదని.. ఇప్పటికే ఉన్న మోడల్ ‘వై’కి అప్డేటెడ్ వెర్షన్. భారత్‌లో తక్కువ ధరలో వేరియంట్స్‌ని లాంచ్ చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తున్నది.
టెస్లా తక్కువ ధర ఎలక్ట్రిక్ కార్లతోనే భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయని పలు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. కంపెనీ భారత్‌లో సుమారు రూ.21లక్షల ప్రారంభ ధరతోనే ఎలక్ట్రిక్ కార్ని లాంచ్ చేసే అవకాశాలున్నట్లు పలు నివేదికలు చెప్పాయి. కంపెనీ మొదట బెర్లిన్ గిగాఫ్యాక్టరీలో తయారైన వాహనాలను భారత్‌కు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. భారత్‌లో లాంచ్ గురించి టెస్లా ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు. కొత్త మోడల్‌కు ఈ41 అనే కోడ్ నేమ్ ఇచ్చిందని.. దాని ఉత్పత్తి 2025లో చైనాలో మొదలవుతుందని భావిస్తున్నారు. ఈ మోడల్ యూరప్, ఉత్తర అమెరికాలోను తయారు చేయనున్నట్లు తెలుస్తున్నది. టెస్లా షాంఘై ప్లాంట్ ప్రధానంగా చైనీస్ మార్కెట్ కోసం ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ యూఎస్‌లో సైతం ఉత్పత్తి పెంచాలని యోచిస్తోంది.
టెస్లా కొత్త వై ధరను తగ్గించడంలో విజయవంతమైతే.. ధర రూ.21లక్షల నుంచి రూ.25లక్షల మధ్య ఉండవచ్చని తెలుస్తున్నది. అయితే, కంపెనీ ధర తగ్గిస్తే కొన్ని ఫీచర్స్‌ను తొలగించే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది. హీటెడ్ సీట్స్, రియర్ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ తదితర ఫీచర్స్‌ను తొలగించనున్నట్లు సమాచారం. కొత్త మోడల్ వై ఇప్పటికే ఉన్న మోటార్, బ్యాటరీ సెటప్‌తోనే రానున్నది. దాంతో కారు ఫర్ఫామెన్స్‌లో పెద్దగా మార్పు ఉండదు. కొత్త మోడల్ వై ప్రస్తుత మోడల్ కంటే కారు చిన్నగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుండగా.. ఈ విషయంలో కంపెనీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. నివేదిక ప్రకారం.. కారు పరిమాణంలో స్వల్ప మార్పు ఉండవచ్చని.. బాడీ డిజైన్‌లో మార్పులు ఉండవని తెలుస్తుంది. ఈ కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ మోడల్ వై ప్రస్తుతం ఉన్న ప్రొడక్షన్ లైన్లలో నిర్మించనున్నట్లు కంపెనీ పేర్కొంది. కంపెనీ ప్రస్తుత, రాబోయే ప్లాట్‌ఫామ్స్‌ను ఫీచర్స్‌ను మిళితం చేయనున్నది.