ఎవరికి ఎప్పుడు.. ఎక్కడ.. ఏమవుతుందో తెలుసుకోవడం చాలా కష్టం. అందుకే ప్రతీ ఒక్కరికీ బీమాతోనే ధీమా. ఆపత్కాలంలో ముఖ్యంగా మనం లేని రోజున మన కుటుంబానికి కొండంత అండగా ఉండేది బీమానే మరి. అలాంటి బీమాల్లో అనేక రకాలున్నాయి. జీవిత బీమా, ఆరోగ్య బీమా, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్‌లు ఇలా ఎన్నో ఉన్నాయి. ప్రీమియంలు, కాలవ్యవధులు, వాటి ప్రయోజనాలనుబట్టి ఆయా వర్గాల్లో ఇవి ఆదరణను సొంతం చేసుకుంటున్నాయి. అయితే ఇటీవలికాలంలో టర్మ్ ప్లాన్స్‌కు, వ్యక్తిగత ప్రమాద బీమాలకు చాలా డిమాండ్ కనిపిస్తున్నది. మరి వీటిలో ఏది ఉత్తమం? అసలు ఈ రెండింటిలో ఉన్న తేడాలేమిటి?
Insurance | టర్మ్ ఇన్సూరెన్స్ అనేది జీవిత బీమాలో ఓ రకం. నిర్ణీత కాలవ్యవధికిగాను పాలసీదారునికి లైఫ్ కవరేజీనిస్తుంది. ఒకవేళ పాలసీ కాలంలో పాలసీదారుడు చనిపోతే బీమా సంస్థ నామినీలకు బీమా సొమ్మును అందిస్తుంది. కుటుంబ పెద్ద లేని లోటును, ప్రధానంగా కుటుంబ సభ్యుల భవిష్యత్తు ఆర్థిక అవసరాలను తీర్చడంలో టర్మ్ ప్లాన్లు చాలాచాలా పాపులారిటీనే సంపాదించాయి. నెల, 3 నెలలు, 6 నెలలు, ఏడాది చొప్పున ఈ బీమా కోసం పాలసీదారులు ప్రీమియం మొత్తాలను చెల్లించవచ్చు. కొన్ని ప్లాన్లలో ఒకేసారి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. మరికొన్ని ప్లాన్లకు పాలసీదారుడు తన వీలునుబట్టి కాలవ్యవధి మొత్తానికి చెల్లించే ప్రీమియంలను ముందే చెల్లించే వెసులుబాటు కూడా ఉంటుంది.
ఉదాహరణకు మీ పాలసీ కాలవ్యవధి 20 లేదా 30 ఏండ్లు ఉందనుకుంటే దాని ప్రీమియంలను ఆ 20-30 ఏండ్లు నిర్ణీత వాయిదాల్లో చెల్లించుకోవచ్చు. లేదంటే ప్రీమియం మొత్తాన్ని 5, 10, 15 ఏండ్లకు కుదించి కూడా వాయిదాల పద్ధతుల్లో చెల్లించవచ్చు. ఇక పాలసీ తీసుకునేటప్పుడున్న వయసు, విద్య, ఆరోగ్య పరిస్థితులు, ఆదాయం, బీమా ప్రయోజనం, కాలవ్యవధిల ప్రకారం ప్రీమియంలను, బీమా మొత్తాలను నిర్ణయిస్తారు. అయితే ఈ టర్మ్ ఇన్సూరెన్స్‌ల్లో మనీ బ్యాక్, మనీ బ్యాక్ లేని పాలసీలు కూడా ఉంటాయి.
పాలసీదారుడు పాలసీ కాలవ్యవధిలో చనిపోకుంటే చెల్లించిన ఆ ప్రీమియంలు తిరిగి రావు. చనిపోతే మాత్రం హామీ మేరకు పాలసీ సొమ్ము మొత్తం వచ్చేస్తుంది. ఇక్కడితో ఆ పాలసీ ముగిసిపోతుంది. ఒకవేళ చనిపోకున్నా కట్టిన ప్రీమియంలు తిరిగి రావాలంటే మాత్రం.. సాధారణ ప్రీమియం కంటే ఎక్కువ మొత్తాలను చెల్లించాల్సి ఉంటుంది. ఇక కనిష్ఠంగా 4 ఏండ్ల నుంచి గరిష్ఠంగా 60 ఏండ్లదాకా టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ కాలవ్యవధిని నిర్ణయించుకోవచ్చు. మీ వయసుపై ఇది ఆధారపడి ఉంటుంది.
వ్యక్తిగత ప్రమాద బీమా అనేది ప్రమాదం బారినపడ్డ పాలసీదారులకే వర్తిస్తుంది. ప్రమాదం కారణంగా చనిపోయినా, లేదంటే శాశ్వత అంగవైకల్యానికి గురైనా, తీవ్ర గాయాలపాలైనా పాలసీని క్లెయిం చేసుకోవచ్చు. ఎలాంటి ప్రమాదం సంభవించకపోతే పాలసీ వర్తించదు. ప్రమాదంతో దవాఖానపాలైనా వైద్య ఖర్చుల కోసం బీమా సొమ్మును పొందే వెసులుబాటు ఉంటుంది. కానీ పాలసీ నిబంధనలు, షరతులకు లోబడి ఈ సౌకర్యాలను అందుకోగలం. అయితే ప్రమాదం సహజంగా కాకుండా ఉద్దేశపూర్వకంగా జరిగినట్టు ఉంటే మాత్రం బీమా సొమ్ము రాదు. ఉదాహరణకు మీరు కారులో వెళ్తున్నప్పుడు ప్రమాదం సంభవిస్తే.. అప్పుడు మీరు మద్యం, ఇతరత్రా మత్తు పదర్థాలను తీసుకున్నా, రాంగ్ రూట్లో వెళ్లినా మీ క్లెయిం రిస్క్‌లో పడుతుంది. ఇక వ్యక్తి వయసు, ఆరోగ్యం, ఇతరత్రా పరిస్థితులేవీ కూడా ఇందులో ప్రాధాన్యం కావు. పాలసీదారులు చెల్లించే ప్రీమియంలనుబట్టి బీమా ప్రయోజనాలుంటాయి.
వ్యక్తిగత ప్రమాద బీమా, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ రెండూ ముఖ్యమే. దేని ప్రాధాన్యత దానికి ఉంటుంది. ప్రమాదంలో గాయపడి, వైద్య చికిత్సను తీసుకుంటున్నప్పుడు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ వర్తించదు. అప్పుడు మనల్ని రక్షించేది పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్సే. కాబట్టి రెండింటినీ తీసుకోవడం ఉత్తమం. ఇక బీమా ప్రీమియంలకు ఆదాయ పన్ను (ఐటీ) చట్టం 1961లోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులుంటాయి. అలాగే బీమాను ఎప్పుడూ భారంగా భావించవద్దు. మన కుటుంబ సభ్యులకు ఇదే కొండంత ధైర్యాన్నివ్వగలదు. ఆర్థిక భద్రతనూ కల్పిస్తుంది.