న్యూఢిల్లీ, జూలై 6: టెలికాం రంగ సంస్థలు మరోసారి చార్జీల మోత మోగించనున్నాయి. త్వరలో మొబైల్ టారిఫ్లు మరో 12-15 శాతం పెరిగే వీలుందని తెలుస్తున్నది మరి. ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్)గాను సెంట్రమ్ ఇన్స్టిట్యూషనల్ రిసెర్చ్ తాజాగా టెలికాం, ఇంటర్నెట్ రంగాలకు సంబంధించి ఓ సమీక్ష నివేదికను విడుదల చేసింది. ఇందులో రాబోయే 3-4 నెలల్లో అన్ని రకాల ప్లాన్ల రీచార్జ్ ధరలు ఎగబాకే అవకాశాలున్నట్టు ఈ బ్రోకరేజీ సంస్థ పేర్కొన్నది. ఇదే జరిగితే వినియోగదారులపై మరింత భారం పడటం ఖాయం.
అనుకూల వాతావరణం
ప్రస్తుతం దేశీయ టెలికాం ఇండస్ట్రీలో 4 సంస్థలే ఉన్నాయి. అందులో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా ప్రైవేట్ రంగానికి చెందినవైతే, బీఎస్ఎన్ఎల్ ప్రభుత్వ రంగానికి చెందినది. ఒకప్పటితో పోల్చితే భారతీయ టెలికాం సంస్థల సంఖ్య భారీగానే పడిపోయింది. మార్కెట్.. కన్సాలిడేషన్ మోడ్లో ఉండటంతో పోటీ వాతావరణం కూడా పెద్దగా లేకుండాపోయింది. ఇదే మొబైల్ టారిఫ్ల పెంపునకు దోహదం చేస్తున్నదన్న అభిప్రాయాలు ఇండస్ట్రీ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయిప్పుడు. ఇక గతంలో అన్ని రకాల కాలవ్యవధులతో కూడిన ప్లాన్ల రీచార్జ్ రేట్లు తక్కువగానే ఉండేవి. అయితే 2జీ, 3జీ, 4జీ, 5జీ.. ఇలా హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తున్నకొద్దీ ధరలు సైతం పెరుగుతున్నాయి.
స్పెక్ట్రమ్ ఖర్చులతో..
ప్రస్తుతం దేశంలో 4జీ, 5జీ మొబైల్ వినియోగదారులే ఎక్కువగా ఉండగా.. జియో, ఎయిర్టెల్ కంపెనీలు 90 శాతానికిపైగా జిల్లాల్లో 5జీ నెట్వర్క్ను కలిగి ఉన్నాయని సెంట్రమ్ చెప్తున్నది. 5జీ కవరేజీ విషయంలో వొడాఫోన్ ఐడియా కూడా వేగం పెంచింది. ఈ నేపథ్యంలో స్పెక్ట్రమ్ (రేడియో తరంగాలు) కోసం ఆయా సంస్థలు భారీగానే ఖర్చు చేయాల్సి వస్తున్నది. దీంతో వాటిని రాబట్టుకోవడానికి చార్జీల పెంపు టెలికాం ఆపరేటర్లకు తప్పనిసరిగా మారుతున్నదని, మార్కెట్లో పరిమిత స్థాయిలోనే కంపెనీలుండటం, అన్నీ ఒకే దారిలో వెళ్తుండటంతో వినియోగదారులకూ వేరే మార్గం ఉండటం లేదని విశ్లేషకులు అంటున్నారు. గడిచిన కొన్నేండ్లలో ప్లాన్ల ధరలు దాదాపు 150 శాతం పెరిగాయి.
ఏఆర్పీయూ పైపైకి..
పెరుగుతున్న స్మార్ట్ఫోన్ల వినియోగంతో హైస్పీడ్ ఇంటర్నెట్కూ గిరాకీ పెరుగుతున్నది. ఈ క్రమంలోనే ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ప్రైవేట్ రంగ టెలికాం కంపెనీలకు ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) 1-1.5 శాతం పెరుగవచ్చని సెంట్రమ్ అంచనా వేస్తున్నది. 5జీ సేవలు అందుబాటులోకి రావడంతో చాలామంది కస్టమర్లు తమ స్మార్ట్ఫోన్లనూ ఆ మేరకు అప్గ్రేడ్ చేసేసుకుంటున్నారు. దీంతో 4జీతో పోల్చితే ధర ఎక్కువ చెల్లించి 5జీ ప్లాన్లను కొనేస్తున్నారు. ఫలితంగా టెల్కోల ఏఆర్పీయూ పెరుగుతూపోతున్నది.
బీఎస్ఎన్ఎల్ వెనుకంజ..
జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలతో పోల్చితే బీఎస్ఎన్ఎల్ వెనుకబడిపోతున్నది. నిజానికి ప్రైవేట్ రంగ టెల్కోలతో చూస్తే బీఎస్ఎన్ఎల్ ప్లాన్ల ధరలు చాలా చౌక. కానీ అంతటా నెట్వర్క్ లేకపోవడం, ఉన్నా సరిగా పనిచేయకపోవడం.. కస్టమర్లను బీఎస్ఎన్ఎల్ వైపునకు చూడనివ్వడం లేదు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచీ ఆశించిన స్థాయిలో మద్దతు లేకపోవడంతో స్పెక్ట్రమ్ వేలంలో వెనుకబడిపోవాల్సి వస్తున్నదని, ఇది కంపెనీని ఆర్థికంగా దెబ్బతీస్తున్నదన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. ప్రైవేట్ రంగ సంస్థలు 5జీ విస్తరణలో దూసుకుపోతుంటే.. బీఎస్ఎన్ఎల్ మాత్రం 4జీ దగ్గరే తంటాలు పడుతున్నది. ఈ పరిణామం కూడా బీఎస్ఎన్ఎల్ నుంచి కస్టమర్లను ఇతర సంస్థల దిశగా నడిపిస్తున్నది. ‘ఎయిర్టెల్, జియోలకు కస్టమర్లు క్యూ కడుతున్నారు. వొడాఫోన్ ఐడియాకూ వినియోగదారులు క్రమంగా పెరుగుతున్నారు. జియో 70 లక్షలు, ఎయిర్టెల్ 50 లక్షలు, వొడాఫోన్ ఐడియా 2 లక్షల కస్టమర్లను గడిచిన త్రైమాసికంలో పెంచుకోవచ్చని అంచనా’ అంటూ సెంట్రమ్ లెక్కలే.. బీఎస్ఎన్ఎల్ దుస్థితికి అద్దం పడుతున్నాయి.