Sharath | హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ యువకుడికి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. మెదక్ జిల్లా దరిపల్లి గ్రామానికి చెందిన వెన్నవెల్లి శరత్‌ను 2023వ సంవత్సరానికి ‘అమెరికా యంగ్ ప్రొఫెషనల్’ అవార్డు వరించింది. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో శరత్‌కు కన్స్ట్రక్షన్ మెనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా ప్రతిష్ఠాత్మక అవార్డును ప్రకటించింది. అక్టోబర్ 29న శరత్‌కు అవార్డును ప్రదానం చేయనున్నారు. శరత్ అమెరికాలోని హూస్టన్తోపాటు అనేక నరగాల్లో ఎన్నో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల నిర్మాణానికి సారథ్యం వహించారు. ఇటీవలే హూస్టన్ నగరంలో నిర్మించిన మెమోరియల్ పార్క్‌కు శరత్‌కు నేషనల్ అవార్డు సైతం దక్కింది.
శరత్ తండ్రి ప్రతాప్‌రెడ్డి మెదక్ కోర్టులో న్యాయవాది కాగా, తల్లి సబిత గృహిణి. శరత్ తాతయ్య విఠల్‌రెడ్డి మెదక్ జిల్లా రామాయంపేట నియోజకవర్గానికి శాసన సభ్యుడిగా సేవలందించారు. ఈ సందర్భంగా శరత్ ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. హూస్టన్తోపాటు అనేక నగరాల్లో అనేక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల నిర్మాణంలో కీలకంగా వ్యవహరించానని చెప్పారు. డ్రైనేజీలు, హైవేలు, పార్కులు, వాటర్, వేస్ట్ వాటర్ ప్రాజెక్టుల నిర్మాణానికి సారథ్యం వహించానని తెలిపారు. అమెరికా నిర్మాణ రంగంలో పదేండ్ల నుంచి పని చేస్తున్నట్టు పేర్కొన్నారు. శరత్ ప్రస్తుతం కన్స్ట్రక్షన్ ప్రాజెక్టు మేనేజర్ హోదాలో ఉన్నారు.