FO Trading | హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌వో) ట్రేడింగ్‌లో వ్యక్తిగత నష్టాల్లో తెలంగాణ తొలిస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో ఆంధ్రపదేశ్ ఉన్నట్టు సెబీ ఇటీవల విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. తెలంగాణలో ట్రేడర్లు సగటున రూ.1.97 లక్షలు నష్టపోగా..అదే ఏపీలో రూ.1.45 లక్షల నష్టాలను చవిచూశారు. రూ.1.37 లక్షల నష్టంతో తమిళనాడు మూడో స్థానంలో నిలువగా, ఆ తర్వాత కర్ణాటక రూ.1.35 లక్షలతో నిలిచింది.
ఐటీ ఉద్యోగులే అధికం: సూర్యదేవ్
దక్షిణ భారతదేశంలో ఐటీ రంగంలో పనిచేసే ఎకువ ఆదాయం పొందే ఉద్యోగులు ఎఫ్‌వో ట్రేడింగ్ చేస్తున్నారని స్టాక్ మార్కెట్ నిపుణుడు సూర్యదేవ్ బండారి తెలిపారు. ఉత్తర, పశ్చిమ ప్రాంతాల ప్రజలు అనుభవ జ్ఞులు కావడం వల్ల దక్షిణ భారతీయుల కంటే ఎకువ జాగ్రత్తగా ఉన్నారని వెల్లడించారు. తక్కువ సమయంలో ఎక్కువగా సంపాదించాలనే అత్యాశతోపాటు మార్కెటింగ్‌పై అవగాహన లేని దక్షిణ భారతీయులు ఎక్కువ నష్టాలు చవిచూస్తున్నారని తెలిపారు.